వాషింగ్టన్: అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు వలసల అంశం మరోమారు చర్చనీయాంశమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసలపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో అమెరికాలోని భారత వలసదారుల్లో ఆందోళన పెరుగుతున్నది. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐఈసీ) దాడులు, వలస వ్యతిరేక ప్రచారం కారణంగా భారతీయులపై ద్వేషపూరిత నేరాలు పెరిగే అవకాశం ఉందన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. న్యూయార్క్‌లోని క్వీన్స్ ప్రాంతంలో గత 20 ఏళ్లుగా రెస్టారెంట్ నిర్వహిస్తున్న భారత సంతతికి చెందిన ‘మోమిన్ అలీ’(మార్చిన పేరు).. ట్రంప్‌నకు మద్దతు ఇస్తున్న కొన్ని గ్రూపులు భారత రెస్టారెంట్లను గమనిస్తున్నాయని ఆరోపించారు.
భారత వలసదారుల్లో ఐసీఈ దాడులు ఆందోళనకు కారణమవుతున్నాయన్నారు. అక్రమంగా ఉంటున్నారనే అనుమానంతో ఫిర్యాదులు రావడంతో వివిధ వ్యాపార సంస్థల్లో తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ చర్యల్లో చట్టబద్ధంగా అమెరికాలో నివసిస్తున్నవారిని కూడా అదుపులోనికి తీసుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. వలసదారుల హక్కుల సంస్థ ఏపీఐ చేసిన విశ్లేషణ ప్రకారం భారతీయులపై నమోదయ్యే ద్వేషపూరిత నేరాల సంఖ్య మధ్యంతర ఎన్నికల నాటికి 30 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నదనే అంచనాలు వెలువడ్డాయి. అలాగే ట్రంప్ ఇమ్మిగ్రేషన్‌పై మరింతగా దృష్టి పెట్టడంతో వలస వ్యతిరేక వాతావరణం పెరగొచ్చని భారతీయ సంఘాలు చెబుతున్నాయి.