సిటీబ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): కుండపోత వర్షం పడిందంటే చాలు ఆ కాలనీలన్నీ బిక్కుబిక్కుమనేవి. నిండా మునిగిపోయేవి. అటువంటి కాలనీవాసుల కష్టాలకు ప్రభుత్వమూ చరమగీతం పాడింది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు వరద ముంపు నివారణకు ప్రత్యేకంగా వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకానికి (ఎస్ఎన్డీపీ) శ్రీకారం చుట్టారు. ఎస్ఆర్డీపీ ఫేజ్-1 కింద రూ.985.45 కోట్లు నిధులను మంజూరు చేసింది. చెరువులు, కుంటలు, తూముల అభివృద్ధి తదితర పనులతో పాటు నాలాల విస్తరణ, ఆధునీకీకరణ, వర్షపు నీరు వెళ్లేందుకు మార్గాలు లేని చోట్ల కొత్త నిర్మాణాలు, కుచించుకుపోయిన చోట నాలా విస్తరణ, రహదారి కంటే ఎత్తున్న నాలాను సమతుల్యంగా చేయడం, వరద నీటి కాల్వల బలోపేతానికి ఎస్ఎన్డీపీ విభాగం ఈ ఏడాది మొదటి నెలలో 15 ప్యాకేజీలలో 37 చోట్ల పనులకు టెండర్లను ఆహ్వానించింది. వర్షాకాలం నాటికల్లా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి వరద ముంపు సమస్యను పరిష్కారం చూపాలని భావించి ఈ దిశగా పనులను జరుపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా 7 ప్యాకేజీలలో పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. ఈ నేపథ్యంలో గతేడాది రెండు సెంటీమీటర్ల వర్షపాతం కురిసినా కాలనీలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసిన పరిస్థితుల నుంచి ప్రస్తుతం దాదాపు వందకు పైగా కాలనీలలో ముంపు సమస్య తప్పించారు. మరికొన్ని చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి.
ఉదయం తెరిపినిచ్చి..
అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పశ్చిమ దిశ నుంచి వీస్తున్న ఉపరితల గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఈదురు గాలులు కూడా వీచే అవకాశమున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాన కొంత తెరిపినిచ్చినప్పటికీ మధ్యాహ్నం నుంచి గ్రేటర్ వ్యాప్తంగా వాన మొదలైంది. రాత్రి 8గంటల వరకు గ్రేటర్‌లోని రాజేంద్రనగర్‌లో అత్యధికంగా 1.3 సెం.మీలు, శివరాంపల్లి, అత్తాపూర్, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లో 1.2సెం.మీలు, బండ్లగూడ, బహుదూర్‌పురా, ఆసిఫ్‌నగర్ తదితర ప్రాంతాల్లో 9.8మి.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. గ్రేటర్ వ్యాప్తంగా ముసురు వాన కురవడంతో జనాలకు తిప్పలు తప్పలేదు.
మూసీలోకి 578 క్యూసెక్కుల నీరు
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను అంచనా వేస్తూ అధికారులు జంట జలాశయాల నుంచి దిగువ మూసీలోకి నీటిని వదులుతున్నారు. హిమాయత్‌సాగర్ జలాశయానికి రూ.150 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 170 క్యూసెక్కుల నీటిని ఒక గేటును 0.6 అడుగు మేర ఎత్తి మూసీలోకి పంపుతున్నారు. ఉస్మాన్‌సాగర్‌కు 400 క్యూసెక్కులు వస్తుండగా, 408 క్యూసెక్కుల నీటిని రెండు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి దిగువ మూసీలోకి వదులుతున్నారు. రెండు జలాశయాల ద్వారా 578 క్యూసెక్కుల నీరు మూసీలోకి చేరుతుంది.
శిథిలావస్థలో బాల్కనీ కూలింది..
కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్ ఎల్ఐజీ 49/5 కు చెందిన శిథిలావస్థ భవనం బాల్కనీ కూలిపోయింది. కిందనున్న రేకుల షెడ్డు రూమ్‌పై బాల్కనీ శిథిలాలు పడడంతో ఆ రూమ్‌లో ఆడుకుంటున్న బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కాలనీ 3వ ఫేజ్‌లోని ఎల్ఐజీ 49, 50, 53, 57 బ్లాక్‌ల మధ్యనున్న రేకుల షెడ్లలో నివసిస్తున్న కుటుంబాలను సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించి ఆ షెడ్లను కూల్చివేశారు. అదేవిధంగా కేపీహెచ్‌బీ కాలనీ 3, 4వ ఫేజ్‌లలో శిథిలావస్థ భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు మూసాపేట సర్కిల్ ఏసీపీ మల్లేశ్వర్ తెలిపారు.

ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి
చిన్నపాటి వర్షం కురిసినా రామారావునగర్, కబీర్‌నగర్, బబ్బుగూడ, స్నేహపురి కాలనీల్లో ఇండ్లలోకి వరదనీరు వచ్చి చేరేది. ఈ సమస్యకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శాశ్వత పరిష్కారం చూపారు. ఎక్కడైతే నాలా కుచించుకుపోయిందో.. అక్కడే ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తుండడంతో ఈ ఏడాది ఎక్కడా నీరు నిలువలేదు.
– నాగుల సత్యం, రామారావునగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు
రూ. 10 కోట్లతో పనులు చేపట్టారు..
వానకాలం వచ్చిందంటే ఈ ప్రాంతా ప్రజలంతా భయంతో కాలం గడిపేవారు. చిన్న వర్షానికే కాలనీలను వరద ముంచెత్తేది. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాకు అండగా నిలిచారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.10 కోట్ల వయ్యంతో పనులు చేపట్టారు.
– తిరుపతి, మూసాపేట డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి
ముంపు తప్పిన కాలనీలు, ప్రాంతాలు
ఫాక్స్ సాగర్ నుంచి వెన్నెలగడ్డ వరకు: ఫాక్స్ సాగర్ సర్ప్లస్ కోర్స్ చానెల్ రిస్టోరేషన్ అండ్ ఫాక్స్ సాగర్ స్లూయిస్ వాల్వ్ నుంచి కెమినాల్ నాలా వరకు, కోల్ కాల్వ నుంచి కెమికల్ నాలా వయా వెన్నెలగడ్డ చెరువు వరకు ఎస్ఎన్డీపీ పనులు.
రూ.95 కోట్లతో 9416 మీటర్ల మేర కొత్త డ్రైన్ నిర్మాణం: బాక్స్ డ్రైన్ 4852 మీటర్లు, ఓపెన్ డ్రైన్ 4564 మీటర్లు, నాలుగు చోట్ల బ్రిడ్జిల నిర్మాణ పనులు. ఇందులో 190 మీటర్ల మేర బాక్స్ డ్రైన్, 2810 మీటర్ల మేర ఓపెన్ డ్రైన్ పనులు పూర్తి చేశారు. ఒక చోట బ్రిడ్జి నిర్మాణ పనులు, 5950 మీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయి.
వరద ముంపు తప్పిన ప్రాంతాలు: ఎస్సీఎల్ ఎన్క్లేవ్, అంగడ్పేట్ విలేజ్, మీనాక్షి ఎస్టేట్స్, స్ప్రింగ్ ఫైల్డ్ కాలనీ, గ్రీన్ పార్కు అవెన్యూ, వెన్నెలగడ్డ, గాయత్రీనగర్
ఈర్ల చెరువు నుంచి …
ఈర్ల చెరువు నుంచి ఎన్‌హెచ్-65 వరకు/ప్రాజెక్టు వ్యయం రూ.15.88కోట్లు
కొత్త డ్రైన్ పొడవు 1470 మీటర్స్, బాక్స్ డ్రైన్ 1470 మీటర్లు (ఇందులో 450 మీటర్ల మేర పూర్తి)
150 మీటర్ల మేర డ్రైన్, సీసీ రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయి
వరద ముంపు తప్పిన ప్రాంతాలు : వైశాలీనగర్, మదీనాగూడ, ద్వారక నగర్, వీకర్ సెక్షన్ , రామకృష్ణ నగర్, అవంతి ఎన్క్లేవ్, ఇక్రిశాట్ కాలనీ, దీప్తిశ్రీ నగర్, శ్రీసాయిరాం నగర్ కాలనీ, శ్రీకృష్ణదేవరాయ కాలనీ, ఆదర్శ్‌నగర్, కృష్ణనగర్, విశ్వేశ్వరయ్య కాలనీ.

ఇసుక వాగు నుంచి నక్కవాగు వరకు
ఇసుక వాగు సర్ప్లస్ కోర్సు
శివ తార రోడ్ నుంచి నక్కవాగు (ఓఆర్ఆర్ వరకు)
ప్రాజెక్టు వ్యయం రూ. 5కోట్లు
కొత్త డ్రైన్ పొడవు 1265 మీటర్లు, ఓపెన్ డ్రైన్లు -1100మీటర్లు
వరద ముంపు తప్పిన ప్రాంతాలు
ఆర్సీ రెడ్డి కాలనీ, ఆనంద్‌నగర్, ఉష్కబావి
మొదుకుళ్ల కుంట నుంచి కొత్త చెరువు వరకు..
మొదుకుళ్ల కుంట నుంచి కొత్త చెరువు వరకు రూ. 17.80కోట్లతో 2187 మీటర్ల మేర కొత్త డ్రైన్ నిర్మాణం
1521 మీటర్ల మేర బాక్స్ డ్రైన్లో 520 మీటర్ల మేర వర్క్ పురోగతిలో ఉంది. ఒక చోట బిడ్జ్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయి
వరద ముంపు తప్పిన ప్రాంతాలు: శివ నగర్, సూర్యనగర్
ఫేజ్-3, ఎంజీ నగర్, కృష్ణానగర్ కాలనీ, సూర్యనగర్ ఫేజ్-2, అంజన్పురి కాలనీ రెడ్డి ఎన్క్లేవ్, శ్రీనివాస్ నగర్ కాలనీ,
భారతీనగర్ కాలనీ, రాంనగర్ కాలనీ
మరికొన్ని ప్రాంతాలలో..
నాగమయ్యకుంట నాలా వద్ద బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా రూ.12 కోట్లతో ఎస్ఎన్డీపీ పనులు జరుగుతున్నాయి.
నల్లపోచమ్మటెంపుల్, వీఎస్టీ-విద్యానగర్రోడ్, హెరిటేజ్ సూపర్ మార్కెట్ నల్లకుంట వద్ద బ్రిడ్జిల నిర్మాణంలో భాగంగా 30 శాతం మేర పనులు జరిగాయి. నాగమయ్యకుంట బస్తీ, పద్మాకాలనీలో కొద్దిగా వరద ముంపు సమస్య
తొలగిపోయిందని అధికారులు తెలిపారు.
అల్వాల్ సర్కిల్లోని వార్డు నంబరు 134లో సీతమ్మనగర్ నుంచి మల్లారెడ్డి కాలనీ వరకు ఆర్సీసీ బాక్స్ డ్రైన్ పనులు పూర్తి చేశారు. మల్లారెడ్డి కాలనీ, గ్రీన్వుడ్ కాలనీ, సీతమ్మనగర్, పెంటారెడ్డి నగర్, వెంకటాపురం ప్రాంతాలలో వరద
ముప్పు సమస్యకు పరిష్కారం చూపారు.
అల్వాల్ సర్కిల్ వార్డు నం. 133లోని బొల్లారం, మల్లారెడ్డి కాలనీ, మధురానగర్, సప్తగిరి కాలనీ, జీఎస్ఆర్ కాన్క్లేవ్, వెంకటేశ్వర కాలనీ, చందానగర్, రెడ్డి ఎన్క్లేవ్, శ్రీనివాస నగర్, జ్యోతినగర్, గంగా పుత్ర కాలనీ
బోరబండ మెయిన్‌రోడ్ నుంచి బబ్బుగూడ కల్వర్ట్ పనులు రూ.730 లక్షలతో చేపట్టారు. 1180 మీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉండగా 550 మీటర్ల మేర పనులు పూర్తి చేశారు. రామారావు నగర్, స్నేహపురి కాలనీ, కబీర్ నగర్, బబ్బుగూడ, మోతీనగర్‌లో వరద ముంపు సమస్య తొలగిపోయింది.
సర్కిల్ 24 పరిధిలోని అబ్రహం నగర్, అంజయ్యనగర్, ముస్లిం బస్తీ, గొల్లకుర్మ సంఘం, రాంకీ పెరల్ ఎస్టేట్, జయ నగర్, ధరణీనగర్, షిర్డీ నగర్, అల్వాల్ కాలనీ ఫేజ్-2, చక్రధరి నగర్, రాఘవేంద్ర కాలనీ, సాయి నగర్ వెస్ట్, శిల్పా బృందావన ప్రాంతాలలో వరద ముంపు సమస్య తొలగిపోయిందని అధికారులు తెలిపారు.
నెక్నాంపూర్ నాలా నుంచి మూసీ వరకు..
నెక్నాంపూర్ నాలా నుంచి మూసీనది వరకు రూ. 24 కోట్లతో 3046 మీటర్ల మేర ఎస్ఎన్డీపీ పనులు
బాక్స్ డ్రైన్ 1678, ఓపెన్ డ్రైన్స్ 1368 మీటర్ల మేర నిర్మాణం, రిటర్నింగ్ వాల్ 360 మీటర్లు
1678 మీటర్ల మేర వర్క్ పురోగతి ఉన్నాయి.
వరద ముంపు తప్పిన ప్రాంతాలు: మన్మూర్ నగర్ కొన్ని ఏరియాలు, అల్కాపూర్ కాలనీ, ఇబ్రహీంబాగ్, నెక్నాంపూర్ విలేజ్, లేక్ వ్యూ కాలనీ