ఉప్పల్, జూలై 14 : ఉప్పల్ నియోజకవర్గంలోని కాలనీల్లో అత్యవసర పనులను సత్వరం పూర్తిచేసేలా చూడాలని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన చిలుకానగర్ డివిజన్లోని పలు కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను పరిశీలించి, కాలనీవాసులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. సీతారామకాలనీ నుంచి రాఘవేంద్రనగర్ వరకు వాటర్ పైప్‌లైన్, సీసీ రోడ్డు పనుల కోసం రూ.1.80 కోట్లు మంజూరు చేశామని , పనులు ప్రారంభించేలా చూస్తామన్నారు. చిలుకానగర్ ప్రధాన రహదారిలోని కల్వర్టు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కల్వర్టు పనులను సత్వరం పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
నియోజకవర్గంలో వరదనియంత్రణ చర్యలు చేపట్టామని, అదేవిధంగా పలు కల్వర్టులను నిర్మించేందుకు నిధులు తీసుకువచ్చామన్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. ఆర్భాటాలు, అసత్య ప్రచారా ల కంటే అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ నాగేందర్, టీఆర్ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, గరిక సుధాకర్, డివిజన్ అధ్యక్షుడు పల్లె నర్సింగ్‌రావు, పిట్టల నరేశ్, కొంపెల్లి రవీందర్, కొకొండ జగన్, రాంరెడ్డి, అల్లిబిల్లి మహేందర్, శ్రీనివాస్‌యాదవ్, బింగి శ్రీనివాస్, బాణాల నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.