మియాపూర్, జూలై 14 : వర్షాకాలం నేపథ్యంలో భవన నిర్మాణ దారులు తగు జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా చూసుకోవాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శంకరయ్య అన్నారు. ప్రధానంగా ఈ వర్షాకాలంలో సెల్లార్ తవ్వకాల విషయంలో జీహెచ్ఎంసీ జారీ చేసిన నిబంధనలను విధిగా పాటించాలని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే భవన నిర్మాణ దారులతో పాటు యజమానులపైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జడ్సీ హెచ్చరించారు. వరద ముంపు నివారణ చర్యల పరిశీలనలో భాగంగా ఆయన జోన్ పరిధిలోని శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల పరిధిలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు సెండ్యూర్, ఆరబిందో బడా నిర్మాణ సంస్థలు సహా పలు ఇతర భవన నిర్మాణాల్లో ఉన్న సెల్లార్లను ఆయన పరిశీలించారు. గోపి చెరువు పరిశీలనతో పాటు చందానగర్ సర్కిల్లో నాలా నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం జడ్సీ శంకరయ్య మాట్లాడుతూ.. సెల్లార్ నిర్మాణ దారులందరికీ ముందస్తుగా నోటీసులను జారీ చేసినట్లు, బేఖాతరు చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. నిర్మాణదారులు సైతం తగు జాగ్రత్త చర్యలను పాటించాలని సూచించారు. నాలా నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. వర్షాకాలంలో వరద ముంపు నివారణకు సంబంధిత బృందాలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ సమస్య నెలకొన్నా తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన మరమ్మతులను పూర్తి చేయాలని జడ్సీ శంకరయ్య ఆదేశించారు. జడ్సీ వెంట ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులున్నారు.