అంబర్‌పేట, జూలై 14: ఇప్పటికే రద్దయిన రేషన్ కార్డుల సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అంబర్‌పేట సర్కిల్ ఏఎస్ఓ దీప్తికి సూచించారు. సర్కిల్ ఏఎస్‌వోగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దీప్తి గురువారం మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబర్‌పేట సర్కిల్లో మొత్తం 13,255 రేషన్ కార్డులు వివిధ కారణాల వల్ల రద్దయ్యాయని, ఇప్పుడు వాటిపై సర్వే జరుగుతున్నందున పారదర్శకంగా నిర్వహించాలని పునరుద్ఘటించారు.
అర్హులైన వారందరికీ మళ్లీ రేషన్‌కార్డు వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో కార్డులు రద్దయ్యాయని, మూడు నెలల పాటు రేషన్ తీసుకోకుండా ఉన్నవారి కార్డులు చాలా ఉన్నాయని, వారిలో నిజమైన అర్హులెవరో గుర్తించి వారి కార్డులను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట కార్పొరేటర్ ఇ.విజయ్‌కుమార్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు సంతోష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.