అబిడ్స్/మెహిదీపట్నం/కార్వాన్, జూలై 14 : నాలాల్లో పూడికతీత పనులు ముమ్మరంగా చేపడుతున్నామని ఎస్ఈ సహదేవ్ రత్నాకర్ తెలిపారు. అహ్మద్‌నగర్ డివిజన్లో బుల్కాపూర్ నాలాతోపాటు జోన్ పరిధిలోని నాలాలు, కాలువల్లో చెత్త, వ్యర్థాలు తొలగించే పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గురువారం మాసబ్‌ట్యాంక్ ఫెన్షన్ ఆఫీస్ ప్రాంతంలో బుల్కాపూర్ నాలా పూడికతీత పనులను పరిశీలించారు. వర్షాలకు నాలాలు ఉప్పొంగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే అన్ని ప్రధాన నాలా ల్లో పూడికతీత పనులు పూర్తి చేసినట్లు తెలిపారు.
ఆసిఫ్‌నగర్‌లో సహాయక చర్యలు
నాంపల్లి నియోజకవర్గంలో ప్రజలకు వర్షంతో ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అధికారులు తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. గురువారం ఆసిఫ్‌నగర్ డివిజన్ కిషన్‌నగర్, శ్యాంనగర్, సయ్యద్ అలీగూడ, న్యూ కిషన్‌నగర్ తదితర ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది రోడ్లపై పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించారు. అంతే కాకుండా వర్షం నీరు సక్రమంగా పోయేలా చర్యలు చేపట్టారు. ఈ పనులు ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి ఎండీ.మూసా, ఇమ్రాన్ లీడర్లు పర్యవేక్షించారు.
సమస్యల పరిశీలన
వర్షాల కారణంగా కార్వాన్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఏఈ శ్రీకాంత్‌తో కలిసి కార్పొరేటర్ ఎం.స్వామి యాదవ్ సమస్యలు పరిశీలించారు.