సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఆకాశమంతా దట్టమైన మబ్బులు.. కాసేపు జల్లులు.. మరికాసేపు భారీగా.. చల్లటి గాలులతో నగరంలో ఐదురోజులుగా విస్తారంగా వర్షం కురుస్తోంది. భానుడి జాడ లేకపోవడంతో పలుచోట్ల పగలే చీకట్లు కమ్ముకుంటున్నాయి. మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పలుచోట్ల భారీ వర్షం కురవడంతో ఆయా ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల్లో బల్దియా వేగంగా సహాయక చర్యలు చేపడుతోంది. నీటి నిల్వలపై నాలుగురోజులుగా బల్దియా కంటోల్ రూమ్‌కు 995 ఫిర్యాదులు వచ్చాయని, 118 చోట్ల చెట్లు పడిపోయినట్లు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాలు నీటితో తొణికిసలాడుతున్నాయి. మంగళవారం రెండు చొప్పన 4 గేట్లెత్తి నీటిని మూసీలోకి వదులుతున్నారు.
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండడంతో జలమండలి అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువ మూసీలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం అంచనా వేస్తూ మూడు రోజులుగా మూసీలోకి నీటిని వదులుతున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం హిమాయత్‌సాగర్ రెండు గేట్లను 0.6 అడుగుల మేర ఎత్తి దిగువకు 340 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ జలాశయాల్లోకి ఎగువ నుంచి 350 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. ఇక ఉస్మాన్‌సాగర్‌లోకి 200 క్యూసెక్కుల నీరు వస్తుండగా, రెండు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి 208 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు.
జూపార్క్ సఫారీలోకి వరద
నగరంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జూ పార్క్‌లోని సఫారీలోకి వరదనీరు వచ్చి చేరింది. మీరాలం చెరువు క్యాచ్మెంట్ ఏరియాల్లో భారీ వరదనీరు పొటెత్తి.. మీరాలం చెరువు అలుగుపారుతూ జూపార్క్ సఫారీలోకి వరదనీరు ముంచెత్తింది. వరదనీరు సఫారీలోకి చేరడంతో జూ అధికారులు అప్రమత్తమై సింహాలు, పులులు, జింకలను ఎన్‌క్లోజర్‌లోకి తరలించి ప్రమాద నివారణ చర్యలను చేపట్టారు. వర్షాలు తగ్గే వరకు పర్యాటకులకు సఫారీ సందర్శనలు నిలిపివేస్తున్నామని జూ పార్క్ క్యూరేటర్ రాజశేఖర్ తెలిపారు. జూ పార్క్ యధావిధిగా ఉ. 8.30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
సాగర్.. నిండుకుండ
హుస్సేన్‌సాగర్ నీటి నిల్వల విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, పరిస్థితి పూర్తి అదుపులో ఉందని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. వరుసగా కురుస్తోన్న వర్షాలతో హుస్సేన్‌సాగర్‌లోకి వరద నీరు భారీగా వస్తుందని, పూర్తి స్థాయి నీటి మట్టం (ఫుల్ ట్యాంక్ లెవల్) 513.41 మీటర్లు కాగా, ప్రస్తుతం 514.44 మీటర్ల మేర నీరు వచ్చి చేరిందన్నారు. గరిష్టంగా 514.75 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందని వివరించారు. వరదను అంచనా వేస్తూ ఇన్‌ఫ్లో విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిండు కుండలా మారిన హుస్సేన్‌సాగర్ అత్యంత పటిష్టంగా ఉందని, జీహెచ్ఎంసీ, నీటి పారుదల శాఖ విభాగం ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
వదలని వాన
నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా గ్రేటర్ హైదరాబాద్‌లో వాన జోరు తగ్గడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది. మంగళవారం కూడా నగరం అంతటా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశాలుండటంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
2.5 సెం.మీ. వర్షపాతం నమోదు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.5 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. చెరువులలో ఇప్పటి వరకు 40 శాతం నీరు వచ్చి చేరింది. ముందస్తు చర్యలలో భాగంగా కలెక్టర్ హరీశ్ ఆదేశాల మేరకు చెరువుల, వాగుల వద్ద అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
అత్యవసర బృందాలు.. నిరంతర సేవలు
గ్రేటర్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్, శానిటేషన్, ఇంజినీరింగ్ , యూబీడీ, డీఆర్ఎఫ్, ఎలక్ట్రిసిటీ, అన్ని శాఖల సమన్వయంతో సమస్యలపై తక్షణం స్పందించి పరిష్కారం చూపుతున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలలో 168 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ సహాయక చర్యలను వేగిరం చేస్తున్నారు. నీటి తొలగింపునకు ప్రత్యేకంగా 128 స్టాటిక్ బృందాలు రంగంలోకి దిగాయి. సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా 128 మినీ మొబైల్ బృందాలు పనిచేస్తున్నాయి. ఇక డీఆర్ఎఫ్ బృందాలు విరిగిన చెట్లను తొలగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం వరకు నీటి నిల్వలపై 995 ఫిర్యాదులు, 118 చోట్ల చెట్లు పడిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్ 040- 21111111గానీ, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిషారం చూపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.