కుత్బుల్లాపూర్,జూలై12:నియోజకవర్గ పరిధిలోని ఉన్న చెరువులను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హెచ్ఎండీఏ అధికారులను కోరారు. మంగళవారం పేట్ బషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న చెరువులను రాబోయే రోజుల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంతో పాటు మరింత సుందరీకరణగా తీర్చిదిద్దేలా తగు ప్రణాళికలను సిద్ధం చేయాలని చర్చించారు.
బాచుపల్లి పెద్ద కుంట, కొంపల్లి మున్సిపాలిటీలో ఊరచెరువు, దుండిగల్ మున్సిపాలిటీలో పెద్ద చెరువులతో పాటు తదితర చెరువులు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ముందస్తు గా హద్దురాళ్లను ఏర్పాటు చేసి చెరువుల చెట్టూ ఫెన్సింగ్ వేయాలని సూచించారు. చెరువులను సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు చుట్టూ ట్రాకింగ్ నిర్మాణాలతో పాటు మొక్కలు పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో హెచ్ఎండీఏ ఈఈ పద్మ, డీఈఈ వెంకట్రామ్, ఏఈ జీవన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదూర్పల్లిగ్రామంలోని పోచమ్మ ఆలయానికి దీప,ధూప నైవేద్యం కింద ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా కృషి చేయాలని కోరుతూ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పద్మారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రాన్ని అందించారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గురుపౌర్ణమి,బోనాల పండుగకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరుతూ పలు కాలనీల సంక్షేమ సం ఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేకు ఆహ్వానపత్రాలను అందించారు.
గాజులరామారం, జూలై12: గాజులరామారం డివిజన్ పరిధిలోని రావినారాయణరెడ్డినగర్ ఫేజ్ 2లో మిగిలి ఉన్న సీసీ రోడ్లు పూర్తి చేసేలా కృషి చేయాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌ను ఆయన నివాసంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడారు. అందుకు వ్యయప్రణాళికలు సిద్ధం చేసి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రషీద్‌బేగ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.