కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 12 : క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తూ క్రీడాభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కేపీహెచ్‌బీ కాలనీ 9వ ఫేజ్, భువనవిజయం గ్రౌండ్లలో నూతనంగా నిర్మిస్తున్న ఇండోర్ షటిల్ కోర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్లు మందడి శ్రీనివాస్‌రావు, పగుడాల శిరీషాబాబురావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో క్రీడాభ్యున్నతికి కృషి చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఎనిమిదేండ్ల కాలంలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థళాలన్నింటినీ క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. మరోవైపు ఇండోర్ స్టేడియంలు, ఓపన్ జిమ్‌లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.
కాలనీలు బస్తీలలో నివసిస్తున్న యువకులు క్రీడాప్రాంగణాలను సద్వినియోగం చేసుకుని క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని.. ప్రజలు ఆరోగ్యం కోసం క్రీడలకు సమయాన్ని కేటాయించాలని కోరారు. ప్రజల అవసరాల కనుగుణంగా అభివృద్ధి పనులు చేస్తూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కాలనీలో నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఇండోర్ షెటిల్ కోర్టులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం కేపీహెచ్‌బీ కాలనీ ధనలక్ష్మి సెంటర్లో వదరనీటి కాలువ మరమ్మతులను పరిశీలించిన ఎమ్మెల్యే పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. వర్షాకాలం నేపథ్యంలో ముంపు సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాలనీలు బస్తీలలో ముంపు సమస్యలెదురైతే సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, డీసీ రవికుమార్, డీఈ ఆనంద్, ఏఈ సాయిప్రసాద్, వాటర్ వర్క్స్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, మాజీ కార్పొరేటర్ బాబూరావు తదితరులున్నారు.
అత్యాధునిక సదుపాయాలతో పశు వైద్యశాల
పశు వైద్యశాలను పునః నిర్మాణంతో అత్యాధునికి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కూకట్పల్లి డివిజన్లో రూ.50 లక్షలతో నిర్మించనున్న పశు వైద్యశాల పునః నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూకట్‌పల్లిలో ఎన్నో ఎండ్ల క్రితం నిర్మించిన పశు వైద్యశాల శిథిలావస్థకు చేరుకోవడంతో ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు. కొత్త భవనం నిర్మాణంతో సకల వసతులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పశు వైద్యశాల అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.