సికింద్రాబాద్, జూలై 12: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షంతో జనం అతలాకుతలమవుతుంది. ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుండడంతో జనం నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయంటూ వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం అలుముకున్న ముసురు వానతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. సికింద్రాబాద్ సర్కిల్లోని చిలకలగూడ, సీతాఫల్మండి, వారాసిగూడ, తార్నాక, బౌద్ధ్దనగర్, మెట్టుగూడ, అడ్డగుట్టతో పాటు కంటోన్మెంట్‌లోని తిరుమలగిరి, ఆర్టీసీ కాలనీ, బోయిన్పల్లి, చిన్నతోకట్ట, సంజీవయ్యనగర్, కార్ఖానా, రసూల్‌పురా, అన్నానగర్, బాలంరాయి, మారేడ్‌పల్లిలోని పికెట్, వాసవీనగర్, 108 బజార్, మహేంద్రాహిల్స్తో సహా సీతారాంపురం, నందమూరినగర్, బొల్లారం ప్రాంతాల్లోని పలు బస్తీలలో చాలా అంతర్గత, ప్రధాన రోడ్లన్నీ ముసురుతో బురదమయంగా తయారయ్యాయి.
కంటోన్మెంట్‌లోని రెండో వార్డులో
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ పేర్కొన్నారు. రెండవ వార్డులోని రామాలయం బస్తీ, శ్రీలంక ఎయిర్‌లైన్స్ గేట్, ఇందిరమ్మనగర్, శ్రీలంక బ్రిడ్జ్, సీబీఎన్ నగర్, అన్నానగర్‌లలో పర్యటిస్తూ బస్తీలో టీఎన్ శ్రీనివాస్ పర్యటిస్తూ నెలకొన్న సమస్యలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ స్తంభాలకు కరెంట్ రావడంతో వెంటనే జింఖానా ఏఈతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో పాటు రామాలయం ఎదురుగా ఉన్న బస్తీలో డ్రైనేజ్ పొంగిపొర్లడంతో కంటోన్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్, రెండవ వార్డు అధ్యక్షుడు కుమార్ ముదిరాజ్, నరసింహ, ఉస్మాన్, గౌస్, ప్రవీణ్ , పొన్నాల బాబు, ప్రకాష్ , అబ్దుల్, మహేష్ ,శ్యామ్, గణేష్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.