హైదరాబాద్/ రవీంద్ర భారతి, జూలై 12 (నమస్తే తెలంగాణ): దళిత, బహుజనవర్గాల జీవన విధానం, సంస్కృతిపై ఆచార్య కొలకలూరి ఇనాక్ చేసిన రచనలు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలంగాణ సాహి త్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. అకాడమీ కార్యాలయంలో మంగళవారం మంచాల మహేశ్వర్ తన ‘ఇనాక్ నాటకాల కథా వస్తువు వైవిధ్యం’ పరిశోధన గ్రంథాన్ని ఇనాక్‌కు అందజేశారు. ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ అట్టడుగువర్గాల జీవితాలను ఇనాక్ తన నవలలు, కథలు, నాటకాల్లో అత్యంత సహజంగా, అద్భుతంగా చిత్రీకరించారన్నారు. ‘మునివాహనుడు’ అనే నాటకంలో దళితుడిని దేవాలయ ప్రవేశం చేయిస్తారన్నారు. గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ మాట్లాడుతూ తాను అధ్యాపకుడిగా ఉన్నప్పుడు మునివాహనుడు నాటకాన్ని విద్యార్థులకు బోధించానని గుర్తుచేశారు. ఇనాక్ నాటకాల్లో కథా వైవిధ్యంపై సమగ్ర పరిశోధన చేసిన మంచాల మహేశ్వర్‌ను వారంతా అభినందించారు.