మల్కాజిగిరి, జూలై 12: మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం అల్వాల్ సర్కిల్, వెస్ట్ వెంకటాపురం మెయిన్ రోడ్డులో కల్వర్ట్ను తొలగించి రూ.1.60కోట్లతో కొత్తగా నిర్మించిన బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేరుస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా బ్రిడ్జి నిర్మాణానికి అధికారులతో సర్వే చేయించి రూ.1.40కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపగా.. మంజూరు చేసిందన్నారు. అనంతరం మరో రూ.20 లక్షలు మంజూరు చేసిందని అన్నారు.
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తికావడంతో ఇక ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అల్వాల్లో వరద ముంపురాకుండా రూ.14 కోట్లతో మోతుకులకుంట చెరువు వయా.. కొత్త చెరువు ఓల్ట్ అల్వాల్, చిన్న రాయుడు చెరువు వరకు బాక్స్డ్రైన్ నిర్మిస్తున్నామని అన్నారు. శ్రీ బేకరీ వద్ద ప్రతి సంవత్సరం వరదల వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామని.. అక్కడ దాదాపు రూ.50లక్షలతో బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు పూర్తిచేసి రోడ్డును ప్రజలకు అం దుబా టులోకి తెచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ నాగమణి, కార్పొరేటర్లు సబితాకిశోర్, శాంతిశ్రీనివాస్ రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్, అనిల్కిశోర్, ఈఎస్ లక్ష్మణ్, రంగారావు, ప్రసాద్, సురేశ్, శ్రీనివాస్, మోసిన్, శివ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.