బేగంపేట్, జూలై 12 : ఈ నెల 17, 18న ఉజ్జయినీ మహంకాళి జాతర సందర్భంగా లష్కర్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ వి.రంగానాథ్ తెలిపారు. సోమవారం ఆయన బేగంపేట్ – రసూల్‌పుర నాలా అభివృద్ధి పనులను, మహంకాళి దేవాలయం పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను ట్రాఫిక్ డీపీపీ ప్రకాశ్‌రెడ్డి, అదనపు డీసీపీ రంగారావు, ఉత్తర మండలం ట్రాఫిక్ ఏసీపీ గంగారెడ్డి, వెస్ట్‌జోన్ ఏసీపీ జ్ఞానేందర్‌రెడ్డి, బేగంపేట్, మహంకాళి, గోపాలపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు సత్తయ్య, అర్లప్ప, శ్రీనివాస్‌లతో కలిసి పరిశీలించారు.
17 నుంచి ఒకవైపు అనుమతి..!
బేగంపేట్ – రసూల్‌పుర నాలా వద్ద ఒకవైపు పనులు పూర్తి కావడంతో ఈ నెల 17 నుంచి బేగంపేట్ – సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలకు అనుమతి ఇవ్వాలని అధికారులకు సూచించారు. సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ వైపు వెళ్లే వారికి మరో రెండు నెలల వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.
ఇక్కడే పార్కింగ్ స్థలాలు..!
అనంతరం మహంకాళి దేవాలయం పరిసరాలను పరిశీలించారు. జాతర సమయంలో చేపట్టాల్సిన ట్రాఫిక్ మళ్లింపులపై స్థానిక ట్రాఫిక్ అధికారులతో చర్చించారు. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీ, ఎస్వీఐటీ, ఆడవయ్య చౌరస్తా, హరిహర కళాభవన్, జనరల్ బజార్, అంజలి టాకీస్, ఎంజీ రోడ్డు గాంధీ విగ్రహం, మొండా మార్కెట్, ఇస్లామియా స్కూల్, బెల్సన్ తాజ్ హోటల్ లైన్ ప్రాంతాల్లో వాహనాలను పార్కింగ్ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్యాట్నీ వైపు నుంచి ఆర్పీ రోడ్డులో, ప్యారడైజ్ నుంచి రాణిగంజ్ వైపు వాహనాలకు అనుమతి ఉండదని చెప్పారు.
సెయింట్ ప్యాట్రిక్స్ స్కూల్ రోడ్డులో వన్‌వే
ఉదయం, సాయంత్రం పాఠశాలలకు వెళ్లే సమయంలో సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో, ప్యాట్రిక్ స్కూల్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రంగానాథ్‌కు వివరించారు. పాఠశాలల సమయంలో మనోహర్ థియేటర్ వద్ద నుంచి ప్యాట్రిక్ స్కూల్ వైపు వన్‌వే మాత్రమే అనుమతిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ట్రాఫిక్ అధికారులకు సూచించారు.