సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ) : పుస్తకాలు స్కానింగ్ చేస్తే నెలవారిగా లక్షల రూపాయల బిల్లులు ఇస్తామంటూ నమ్మించి భారీగా డిపాజిట్ సేకరించి బిచాణా ఎత్తేసిన ముఠా కోసం సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. నార్త్ ఇండియాకు చెందిన అమిత్‌శర్మ, మరికొందరితో కలిసి ఏడాది కిందట డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బంజారాహిల్స్, గ్రీన్ ల్యాండ్స్‌లో కార్యాలయాలు తెరిచారు. అమెరికాకు చెందిన ప్రాజెక్ట్ చేస్తున్నామని, అయితే పుస్తకాలు స్కాన్ చేసి, వాటిని కంప్యూటర్లో ఫీడ్ చేస్తూ డిజిటలైజేషన్ చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమంటూ చెప్పుకున్నారు.
వారి మాటలు నమ్మిన వందలాది మంది ఈ ప్రాజెక్ట్‌లకు ఆకర్షితులై రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు డిపాజిట్ చెల్లించి ప్రాజెక్ట్‌లు తీసుకున్నారు. డిపాజిట్‌ను బట్టి ఒక్క పేజీకి రూ.5 నుంచి రూ.10 వరకు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. మొదట్లో ఒకటి రెండు నెలలు సాఫీగా నెలవారి బిల్లులు చెల్లించడంతో ఒకరిని చూసి మరొకరు పెట్టుబడులు పెట్టారు. తీరా జూన్ 30న నిర్వాహకులు కంపెనీని ఎత్తివేయడంతో ఈ స్కామ్ విషయం బయటకు వచ్చింది.
సుమారు రూ.30 కోట్ల డిపాజిట్లు
నిందితులు పక్కా ప్లాన్‌తో సుమారు రూ.30 కోట్ల వరకు డిపాజిట్లుగా వసూలు చేసి బిచాణా ఎత్తేశారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఢిల్లీ, యూపీకి చెందిన ఈ ముఠా ముందుగా హైదరాబాద్‌లో సంస్థలను ఏర్పాటు చేసి డిపాజిట్ దారుల నమ్మకాన్ని సంపాదించుకొని మోసం చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలాంటి నేరాలు గతంలోనూ చేసి ఉంటారని, ఈ స్కామ్‌లు దేశ వ్యాప్తంగా ఇంకెక్కడైనా జరిగాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అరస్టైయిన సైబర్ నేరగాళ్లకు సంబంధించిన చిట్టాను పరిశీలిస్తున్నారు.