జీడిమెట్ల, జూలై 12: పక్షవాతంతో మంచం పట్టిన తండ్రి తనకు భారంగా మారాడని మద్యం మత్తులో కన్నకొడుకే గొంతు నులిమి హతమార్చాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధి కుత్బుల్లాపూర్ గ్రామం కురుమ బస్తీలో చోటు చేసుకున్నది. సీఐ ఎం.పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ రాష్ట్రం భీమవరం ప్రాంతానికి చెందిన సత్యనారాయణ, దుర్గమ్మ దంపతులు వారి ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి 30 ఏండ్ల కిందట నగరానికి వచ్చి కుత్బుల్లాపూర్‌లోని కురుమ బస్తీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా సత్యనారాయణ కొడుకు సురేశ్ భార్య పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. పక్షవాతం కారణంగా ఐదేండ్ల కిందట సత్యనారాయణ మంచం పట్టగా, తల్లి దుర్గమ్మకు నెల రోజుల కిందట గొంతు ఆపరేషన్ కావడంతో ఇద్దరికీ సురేశ్ సపర్యలు చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా సోమవారం మద్యం సేవించి వచ్చిన సురేశ్ తండ్రితో గొడవ పడ్డాడు. దీంతో విసుగుచెందిన తల్లి రామంతాపూర్‌లోని కూతురు ఇంటికి వెళ్లింది. సోమవారం రాత్రి మళ్లీ మద్యం సేవించి వచ్చిన సురేశ్ కత్తితో తండ్రి మెడకోసి హతమార్చాలని ప్రయత్నించాడు. అగి తెగకపోవడంతో గొతునులిమి చంపేశాడు. అయితే అనారోగ్యంతో మృతిచెందాడని చుట్టుపక్కల వారిని, కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అనుమానించిన స్థానికులు డయల్ 100కు సమాచారం అందించగా సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి హత్యచేసినట్లు నిర్ధారించారు. సురేశ్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.