సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ) : నివాస గృహాల విక్రయాల్లో హైదరాబాద్ కేంద్రంగా మంచి వృద్ధి రేటు కనిపించిందని నైట్ ఫ్రాంక్ ఇండియా మంగళవారం నివేదికను విడుదల చేసింది. జూన్ నెలలో మొత్తం 5408 యూనిట్లు రిజిస్ట్రేషన్ కాగా, వీటి విలువ రూ.2841 కోట్లుగా ఉందని పేర్కొంది. జూన్లో అమ్మకాలు పరిమితంగా ఉన్నప్పటికీ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నగరంలో 17074 ఆస్తుల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. ఏడాదిలో పెరుగుదల శాతం 9.1గా ఉంది.
క్యూ-2లో మొత్తంగా జరిగిన లావాదేవీల విలువ రూ.8685 కోట్లుగా ఉంది. జూన్లో నమోదైన గృహాల అమ్మకాల్లో రూ.25-50లక్షల విలువ చేసే ఇండ్ల శాతం 53శాతం ఉండగా, గత ఏడాది జూన్లో 35శాతం ఉంది. రూ.50లక్షలు అంత కంటే ఎక్కువ విలువ చేసే ఆస్తుల విక్రయాలు 2021లో 25శాతం ఉండగా, 2022లో 32శాతానికి పెరిగిందని నివేదికలో వెల్లడించింది. జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డిలో 44శాతం, మేడ్చల్-మల్కాజిగిరి 39 శాతం, హైదరాబాద్లో 13 శాతం రిజిస్ట్రేషన్లు అయ్యాయని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ తెలిపారు.