సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణ సంసృతిని చాటిచెప్పే బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయం నుంచి భారీ వర్షాలు, బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూడాలని సూచించారు.
అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని తెలిపారు. అత్యవసర సేవల కోసం జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ 040- 21111111ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సుభాష్ రెడ్డి, అరెకపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, మైనంపల్లి హన్మంతరావు, కలెక్టర్లు అమయ్‌కుమార్, హరీశ్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, సాంసృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
బోనాల ఉత్సవాలకు రూ.15 కోట్లు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తలసాని తెలిపారు. సుమారు 3500కు పైగా దేవాలయాలకు ఉత్సవాలకు ముందే ఆర్థిక సహాయం చెకులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 17న బోనాల ఉత్సవాలు నిర్వహించే సికింద్రాబాద్ పరిధిలోని ఆలయాలకు రెండు రోజుల్లో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చెకుల పంపిణీ జరుగుతుందని, 24న బోనాలు నిర్వహించే హైదరాబాద్ పరిధిలోని ఆలయాలకు 18వ తేదీన చెకులను పంపిణీ చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా సాంసృతిక శాఖ కళాకారులచే ప్రతి నియోజకవర్గం పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాతబస్తీలోని 25 ప్రాంతాల్లో సాంసృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో వేదికలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.