సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జోనల్ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జోనల్ వారీగా చేపడుతున్న సహాయక చర్యలపై మేయర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. నాలాలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, మ్యాన్‌హోల్స్ వద్ద చెత్త, మట్టి నిలువకుండా చూడాలని ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిషరించాలని తెలిపారు.
అధికారులందరూ 24 గంటల పాటు అందుబాటులో ఉండే విధంగా చూడాలని, ఫిర్యాదు వచ్చిన వెంటనే సంబంధిత ప్రదేశాలకు వెళ్లి పరిషరించాలని సూచించారు. ఒకే రోజులో 7సెంటీ మీటర్ల వర్షం పడినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో భవిష్యత్‌లో కూడా అంత కంటే ఎకువ వర్షం పడినా.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు రవికిరణ్, శంకరయ్య, శ్రీనివాస్ రెడ్డి, మమత, పంకజ, అశోక్ సామ్రాట్, తదితరులు పాల్గొన్నారు.