బంజారాహిల్స్, జూలై 12: నగరం నడిబొడ్డున సుమారు రూ.300 కోట్ల విలువైన స్థలం ప్రభుత్వానిదే అని సుప్రీం కోర్టు తీర్పును ఇవ్వడంతో షేక్‌పేట మండల అధికారులు మంగళవారం సదరు భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఏడాది క్రితం హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో ప్రైవేటు వ్యక్తుల పరమైన ఈ స్థలాన్ని కాపాడేందుకు రెవెన్యూ శాఖ సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లి విజయం సాధించింది. వివరాల్లోకి వెళ్తే.., షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నం: 403లోని టీఎస్ నం:17, బ్లాక్ డీ, వార్డు-10 కిందకు వచ్చే బంజారాహిల్స్ రోడ్ నం:14లో 2.10 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలం తమదే అంటూ అనేక మంది ఫోర్జరీ పత్రాలతో కోర్టులలో కేసులు వేశారు. కాగా, బాదం రంగస్వామి ఆనే వ్యక్తి 1981లో వేసిన కేసులో సిటీ సివిల్ కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాగా హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు.
గత ఏడాది ఏప్రిల్‌లో ఈ స్థలం బాదం రంగస్వామిదే అంటూ హైకోర్టు తీర్పు వెలువరించడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సుమారు రూ.300 కోట్ల విలువైన ఈ స్థలంలో తమకు అనుకూలంగా తీర్పు రావడంతో అప్పటికే డెవలప్మెంట్ అగ్రిమెంట్ కలిగి ఉన్న శాంతా శ్రీరామ్ నిర్మాణ సంస్థ రాత్రికి రాత్రే స్థలం చుట్టూ బ్లూ షీట్స్ ఏర్పాటు చేసి పొసెషన్ తీసుకుంది. అయితే ఈ స్థలాన్ని ఎలాగైనా కాపాడుకోవాలనే లక్ష్యంతో రెవెన్యూ శాఖ సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లింది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఆ స్థలం ప్రభుత్వానిదే అంటూ సోమవారం తుది తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పుతో మంగళవారం షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి స్థలాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.