మేడ్చల్, జూలై 12(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే ఉన్నారని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. మంగళవారం ఆయన నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ ప్రజలకు పూర్తి నమ్మకం ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ నాయకులు చేస్తున్న అనవసర ఆరోపణలపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కలలు కంటున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చేప్పెందుకు సమాయత్తం అవుతున్నారని తెలిపారు.
తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ చేసిందేమీ లేదనే విషయం ప్రజలకు తెలుసని శంభీపూర్ రాజు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా సుఖంగా ఉంటే బీజేపీ నాయకులకు మింగుడు పడటం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్పై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్న తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. బీజేపీ నాయకులు ఇకనైనా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు మానుకోకుంటే ప్రజల ఆగ్రహనికి గురికాక తప్పదని హెచ్చరించారు.
ప్రజలందరి ఇంటి పార్టీగా మారిన టీఆర్ఎస్…
టీఆర్ఎస్ పార్టీ అంటే ప్రజలందరి ఇంటి పార్టీఅని టీఆర్ఎస్ అధ్యక్షుడు శంబీపూర్ రాజు అభివర్ణించారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రమంతటా జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలంతా టీఆర్ఎస్ వైపు వచ్చారని, బీజేపీ నాయకులు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉంటారని, బీజేపీ నాయకులు దీనిని గమనించాలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీని విమర్శించే స్థాయి బీజేపీకి లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్న టీఆర్ఎస్ పార్టీని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు.