సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): క్యాసినో కాయిన్స్‌తో పేకాట ఆడుతున్న ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి.. రూ. 1.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. బేగంబజార్‌కు చెందిన ఘన్‌శ్యామ్ దాస్ కర్వా స్థానికంగా పంటర్లను పిలిచి.. పేకాట ఆడిస్తున్నాడు. డబ్బులు కనిపించకుండా ఉండేందుకు క్యాసినో కాయిన్స్‌ను వాడుతున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఆదివారం ఆ ఇంటిపై నార్త్‌జోన్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం దాడి చేయగా, నిర్వాహకుడితో పాటు దయారామ్, పంకజ్‌కుమార్, జయ ప్రకాశ్ చింతంగి, కమల్ సోనీ, జితేందర్, శ్యాంసుందర్, కృష్ణ బంగ్ పట్టుబడ్డారు.