సికింద్రాబాద్, జూలై 10: సికింద్రాబాద్/మారేడ్‌పల్లి/బొల్లారం, కంటోన్మెంట్ల వ్యాప్తంగా ఉన్న పలు దేవాలయాల్లో ఆదివారం తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో అభిషేకాలు, తులసి అర్చన, రాజభోగ నివేదన, విష్ణు సహస్త్ర నామస్తోత్ర పారాయణం చేశారు.
ఆరోవార్డులోని నందమూరినగర్ పోచమ్మ ఆలయంలో బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్, విద్యావతి దంపతులు గోపురాన్ని దర్శించుకుని క్షీరాభిషేకం చేశారు.
చిలకలగూడ నామాలగుండులో కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు అర్చనలు, అభిషేకాలు, లక్ష తులసీదళార్చన చేశారు.
పాండు రంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో..
తొలి ఏకాదశిని పురస్కరించుకొని రెజిమెంటల్‌బజార్‌లోని శ్రీ పాండు రంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి.
ఉదయం 4 నుంచి ఆలయంలో అభిషేకం, తిరువారాధన, సే వాకలం, నివేదన, మంగళశాసనం, తీర్థప్రసాద గోష్టి, ప్రత్యేక తులసి అర్చన, యాగశాల ఆరాధన,పూజా కార్యక్రమాలు 2 గంటల వరకు నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర బేవరేజేస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, కార్పొరేటర్ కొంతం దీపిక, జీహెచ్ఎంసీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు సీఎన్. నర్సింహముదిరాజ్, టీఎన్. శ్రీనివాస్‌లు పాల్గొని స్వామి వారికి పూజలు చేశారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈఓ సురేందర్ అన్ని ఏర్పాట్లు చేశారు.
సోమవారం ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమంలో అర్చకులు రాజగోపా ల్, టీఆర్ఎస్ నాయకులు రావుల సతీష్ ,శివ పాల్గొన్నారు.
కంటోన్మెంట్ ఎనిమిదో వార్డు బొల్లారం సదర్‌బజార్ మహంకాళి అమ్మవారి ఆలయంలో యజ్ఞం,గణేష్ హోమం నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
కంటోన్మెంట్ ఏడో వార్డు తిరుమలగిరి గాంధీనగర్ లో ఆదివారం శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో విగ్రహాప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీగణేష్,ఆలయ కమిటీ సభ్యులు రాజన్ తదితరులు పాల్గొన్నారు.