జియాగూడ, జూలై 9 : బక్రీద్ నేపథ్యంలో నగరంలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన జియాగూడ మేకల మండి(కబేళా) కిటకిటలాడుతున్నది. ఈ మార్కెట్‌కు నిత్యం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతం నుంచే కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యాన, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు దిగుమతి అవుతుంటాయి. బక్రీద్ సందర్భంగా వీటి క్రయవిక్రయాలు జోరుగా సాగుతుండటంతో రెండ్రోజులుగా మార్కెట్లో మరింత రద్దీ నెలకొంది. కార్వాన్, లంగర్‌హౌస్, గోల్కొండ, మెహిదీపట్నం, నాంపల్లి, సికింద్రాబాద్, పాతబస్తీతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు కబేళాకు తరలివస్తున్నారు.
జియాగూడ కబేళాలో నిత్యం 5వేల నుంచి 8వేల జీవాల క్రయవిక్రయాలు జరుగుతుండగా, బక్రీద్ కారణంగా డిమాండ్ పెరగడంతో వ్యాపారులు జీవాల ధరలను అమాంతం పెంచేశారు. 20 నుంచి 30 కిలోలు ఉన్నవి దాదాపు 30 వేల రూపాయల ధర పలుకుతున్నాయి. వీటికి పోటీగా తెలంగాణ పొట్టేళ్లకు కూడా డిమాండ్ పెరిగింది. వీటిని 9 నుంచి 14 వేల రూపాయల వరకు అమ్ముతున్నారు. తూకంలో తక్కువగా ఉన్నా..బిర్యానీకి దీనిని ఉపయోగిస్తుంటారు. దీంతో తెలంగాణ పొట్టేళ్లు, మేకలకు మంచి గిరాకీ ఉంది. అయితే మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మేకలు, గొర్రెలు, పొట్టేళ్ల దిగుమతి పూర్తిగా తగ్గిందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
వర్షాల వల్లే..
ప్రతి సంవత్సరం బక్రీద్ సందర్భంగా జియాగూడ మేకల మండికి నిత్యం 40 వేల నుంచి 50 వేల వరకు మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు దిగుమతి అవుతుంటాయి. అయితే మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానతో పాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ఈ సారి దిగుమతి తగ్గి.. ధరలు పెరిగాయి.
– గౌలిపూర ప్రకాశ్, వ్యాపారి