సిటీబ్యూరో/ఇబ్రహీంపట్నం/వనస్థలిపురం, సికింద్రాబాద్, జూలై 9(నమస్తే తెలంగాణ): మారేడ్‌పల్లి ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు ఓ మహిళకు తుపాకీ గురిపెట్టి..లైంగిక దాడికి పాల్పడటం పోలీస్ వర్గాల్లో కలకలం స్పష్టించింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు నివేదిక అందించడంతో నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ..సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
భర్త లేడని తెలుసుకొని.. వాట్సాప్ కాల్ చేసి..
వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటరమణ కాలనీలో నివాసముంటున్న సదరు మహిళ ఇంటికి మారేడ్‌పల్లి ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు గురువారం రాత్రి వెళ్లాడు. అంతకుముందు ఆమె భర్త సొంతూరుకు వెళ్లాడని తెలుసుకొని.. వాట్సాప్ కాల్ చేసి..లైంగిక కోరిక తీర్చాలని అడిగాడు. ఆ తర్వాత ఆమె ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యాడు. అయితే నాగేశ్వరరావు తీరును పసిగట్టిన సదరు మహిళ.. ముందుగానే భర్తకు సమాచారం ఇవ్వడంతో నాగేశ్వరరావు ఆమెను తుపాకీతో బెదిరించి.. లైంగికదాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో భర్త ఇంటికి చేరుకున్నాడు. తలుపులను తీయకపోయేసరికి బద్దలు కొట్టాడు. నాగేశ్వరరావుపై కర్రతో దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత దంపతులిద్దరిపై నాగేశ్వరరావు తుపాకీ ఎక్కుపెట్టి.. మీరు నగరం విడిచి వెళ్లాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు. తన కారులో మహిళను, ఆమె భర్తను ఎక్కించుకున్నాడు. ఆమె భర్తతోనే కారును డ్రైవ్ చేయించాడు.
ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం చెరువు వద్ద టైరు పేలడంతో కారు రోడ్డు పక్కను లోయలో పడింది. భార్యాభర్తలకు గాయాలయ్యాయి. నాగేశ్వరరావుకు కూడా దెబ్బలు తగిలాయి. ఈ సమయాన్ని అవకాశంగా చూసుకుని భార్యాభర్తలు అక్కడి నుంచి పారిపోయారు. కారుబోల్తా విషయాన్ని ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారు. అప్పటికే నాగేశ్వరరావు లేడు. ఈ సంఘటనపై ఆరా తీయగా, మహిళ భర్త ఇబ్రహీంపట్నం పీఎస్‌లో నాగేశ్వరరావు కిడ్నాప్ చేసి.. తీసుకెళ్తుండగా, ప్రమాదం జరిగిందని ఫిర్యాదు చేశాడు. బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యంపై వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఐపీసీ సెక్షన్లు 452, 376(2), 448, 365, ఆర్మ్స్ యాక్ట్ ల కింద అభియోగాలను నమోదు చేశారు.
2018 నుంచే పరిచయం..
నాగేశ్వరరావు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న సమయంలోనే సదరు మహిళ భర్త ఓ కేసులో దొరికాడు. ఆ విచారణలో ఇన్స్పెక్టర్కు ఆ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ సందర్భంగా నాగేశ్వరరావు అనేకసార్లు ఆమెను బలవంతం చేసేందుకు ప్రయత్నించినప్పుడు విషయాన్ని భర్తకు చెప్పింది. దీంతో అతడు నాగేశ్వరరావును బెదిరించాడు. ఈ విషయాన్ని మీ ఇంట్లో చెబుతానని హెచ్చరించడంతో మరోసారి తప్పు చేయనని నాగేశ్వరరావు మాట ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత భార్యాభర్తలను పట్టుకొచ్చి ‘నన్నే బెదిరిస్తారా.. నీ భర్త గంజాయి దందా చేస్తున్నాడం’టూ.. గంజాయి మూటలు పెట్టి ఫొటోలు దించి భయపెట్టించినట్లు తేలింది. అంతకుముందు నాగేశ్వరరావు ఆదిబట్ల పరిసరాల్లో తనకు ఉన్న రెండెకరాల ఫాంహౌజ్‌లో మహిళ భర్తను పనికి పెట్టుకుని నెలకు 15 వేల జీతం ఇచ్చాడని తేలింది. ఈ వివరాలను స్పెషల్ బ్రాంచి అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో ఇచ్చారు. దీంతో ఆదిబట్ల పరిసరాల ప్రాంతంలో నాగేశ్వరరావుకు అంత ఖరీదైన స్థలం ఎలా వచ్చిందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇంకా ఎన్ని అవినీతి వ్యవహారాలకు పాల్పడి ఉంటాడనే ప్రచారం ఇటు పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతున్నది.
నాగేశ్వరరావు సస్పెన్షన్
నాగేశ్వరరావు వ్యవహారంపై రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌కు నివేదిక అందించారు. దీంతో నాగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ.. సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. అతడిని రెండురోజుల్లో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, నాగేశ్వరరావు ఉదంతం ట్రై సిటీ పోలీసు కమిషనరేట్ల పరిధిలో కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్‌లో అత్యధిక కాలం పనిచేసిన నాగేశ్వరరావు.. ఇటీవల బంజారాహిల్స్ పీఎస్‌లో పోస్టింగ్‌ను పొంది.. మూడు నెలల్లో బదిలీ అయ్యాడు. పబ్ వ్యవహారంలో స్టేషన్‌కు 148 మంది యువతీయువకులను రాత్రి సమయంలో తీసుకువచ్చి నిలబెట్టిన వైనంపై విమర్శలు ఎదుర్కొన్నాడు. పలు భూ కబ్జా వ్యవహారాల్లో కూడా అతి చేశాడనే ముద్ర వేసుకున్నాడు.