శేరి లింగంపల్లి, జూలై 9: వారంతా.. బంగారు భవిష్యత్తుకు కలలు కన్నారు.. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడ్డారు. ఏన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి… పట్టుదలతో అనుకున్నది సాధించి తమ భవితకు బాట లు వేసుకోవడంతో పాటు తమ తల్లిదండ్రులు తమపై పెట్టుకున్న ఆశలను గుర్తెరిగి వారి కళ్ల ముందు పట్టాలు అందుకోవడం విద్యార్థి జీవితంలో మరిచిపోలేని మధు ర ఘట్టం. అలాంటి సుమధుర ఘట్టాలకు వేదికైంది గచ్చిబౌలిలోని బ్రహ్మ కుమారీస్ శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియం.
గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిపుల్ ఐటీ) 21 వ స్నాతకోత్సవం శనివారం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూకే ఆక్స్‌ఫర్డు యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అలీసన్ నోబెల్ విచ్చేసి వివిధ విభాగాల్లో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణ, వివిధ విభాగాల డీన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు తెల్లటి ఖాదీ కుర్తా, పైజామా, పంజాబీ డ్రెస్, చీరలతో పాటు మెడలో కండువాలతో విద్యార్థులు, అధ్యాపకు లు హాజరై సరస్వతీ వందనంతో కార్యక్రమాన్ని ప్రారంభించి ఆకట్టుకున్నారు. పలు కోర్సుల్లో విద్యనభ్యసించి న మొత్తం 556 మంది ఈ స్నాతకోత్సవంలో పట్టాలు అందుకున్నారు. 22 మంది పీహెచ్‌డీలను, 133 మం ది మాస్టర్స్ పట్టాలను అందుకున్నారు. ట్రిపుల్ ఐటీలో విశేష ప్రతిభ కనబర్చిన బంగారు పతకాలు అందజేశా రు. 2022 సంవత్సరానికి బీ టెక్ సీఎస్ఈకి చెందిన జివితేష్ జైన్ మొదటిసారిగా 10 సీజీపీఏ సాధించి చరిత్ర సృష్టించారు.
సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి: ఆక్స్‌ఫర్డు వర్సిటీ ప్రొ॥ అలీసన్ నోబెల్
21వ శతాబ్ధంలో ఎదురమ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు యువత సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉం దని యూకే ఆక్స్‌ఫర్డు యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీసన్ నోబెల్ అన్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించినపుడే విజయాలు సొంతమవుతాయని, ఆశించిన ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు. నేడు రొబోటిక్స్ మానవ మనుగడలో కీలక పాత్ర పో షిస్తాయని, రొబోటిక్స్, మిషన్ లర్నింగ్‌లలో రాణించాలన్నారు. సరైన సమయంలో చక్కటి ఆలోచనతో కూడిన ఆవిష్కరణలతో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయాలు సొంతమవుతాయని, అనుకున్న దాంట్లో పురోగతి సాధిస్తామని తెలిపారు. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ పీజే నారాయణ మాట్లాడుతూ కొవిడ్ మహమ్మారి కారణంగా విద్యార్థులు రెండేండ్లుగా తరగతి గదులకు దూరమయ్యారని, ఆన్లైన్ క్లాసులకే పరిమితమయ్యారని అన్నారు. ఈ సంవత్స రం 145 సంస్థలు ప్లేస్మెంట్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని, వాటిలో 57 సంస్థలు ఉత్తమంగా విద్యార్థులకు ఉద్యోగవకాశాలు కల్పించాయని పేర్కొన్నారు.
సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే లక్ష్యం
బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ)లో బంగారు పతకం సాధించాను. 2022వ సంవత్సరానికి ట్రిపుల్ ఐటీ గోల్డ్ మెడల్ అవార్డును సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా స్వస్థలం ఢిల్లీ. పూణేలోని ఓ సంస్థలో డాటా సైంటిస్ట్‌గా క్యాంపస్ సెలక్షన్లో నాకు ఉద్యోగం లభించింది. భవిష్యత్తులో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే నా లక్ష్యం.
– జివితేష్ జైన్, గోల్డ్ మెడల్ పురస్కార గ్రహీత
సంతోషంగా ఉంది
త్రిపుల్ ఐటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ సీఎస్ఈలో ఈ సంవత్సరానికి గాను ఉత్తమ ఆల్‌రౌండర్‌గా బంగారు పత కం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. మా స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్. నాన్న పోస్టల్ డిపార్టుమెంట్లో ఉద్యోగి, అమ్మ గృహిణి. ట్రిపుల్ ఐటీలో పరిశోధనా పరమైన సేవలు అపారమైనవి. ఇక్కడ విద్యాభ్యాసం ఆనందదాయకం. ఇది నా జీవితంలో మరిచిపోలేని ఘట్టం.
– మధుకర్ ద్వివేది, ఉత్తమ ఆల్ రౌండర్, బంగారు పతక గ్రహీత