సిటీబ్యూరో, జూలై 9 (నమస్తే తెలంగాణ) : ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్ వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో నగరం తడిసి ముైద్దెంది. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. సోమాజిగూడలోని ఆస్కి కాలేజీలో భారీ వృక్షం నేలకూలింది. జూబ్లీహిల్స్‌లో చెట్లు విరిగిపడి 7ద్విచక్రవాహనాలు, ఒక కారు ధ్వంసమైంది. పలు చోట్ల వాన నీటితో రోడ్లు జలమయమయ్యాయి.
రాత్రి 8.30 గంటలకు ఖైరతాబాద్‌లో అత్యధికంగా 3.1 సెం.మీలు, శేరిలింగంపల్లి హఫీజ్‌పేటలో 2.6సెం.మీలు, మాదాపూర్‌లో 2.1సెం.మీలు, రాజేంద్రనగర్, రామచంద్రాపురం, శివరాంపల్లి-మైలార్‌దేవ్‌పల్లిలో 1.9సెం.మీలు, కేపిహెచ్బి, మియాపూర్, హైదర్‌నగర్, గాజులరామారం ప్రాంతాల్లో 1.7సెం.మీలు, బాలానగర్, గచ్చిబౌలి, కందికల్‌గేట్‌లో 1.5సెం.మీలు, కుత్బుల్లాపూర్, రాయదుర్గ, షేక్‌పేట, బహుదూర్‌పురా, జీడిమెట్లలో 1.3సెం.మీలు, ఆసిఫ్‌నగర్, సికింద్రాబాద్, మోండామార్కెట్, ముషీరాబాద్ ప్రాంతాల్లో 1.0సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే రాగల మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదారబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గ్రేటర్‌కు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో…
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 3.27 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా ఉప్పల్ మండలంలో 42.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ మొదటి వారం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 25 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.