సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : ఉన్న చోట నుంచే ఖరీదైన వైద్యసేవలను పొందే సదావకాశాన్ని నిరుపేదల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన తెలంగాణ సర్కార్ ఈ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నది. టెలీమెడిసిన్ ద్వారా ప్రస్తుతం అందిస్తున్న సూపర్ స్పెషాలిటీ సేవలకు అదనంగా మరిన్ని సేవలను అందించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో 151బస్తీ దవాఖానలు ఉండగా.. ప్రస్తుతం 80బస్తీ దవాఖానల్లో టెలీమెడిసిన్ సేవలు అందిస్తున్నారు. త్వరలో మరో 71బస్తీ దవాఖానల్లో కూడా అందించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. అయితే టెలీమెడిసిన్ ద్వారా ప్రస్తుతం సాధారణ సేవలతో పాటు ఆర్థో, డెర్మటాలజి, యురాలజి, నెఫ్రాలజి వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తున్నారు. కరోనా వేళ ఈ సేవలతో ఎంతో ఉపశమనం కలుగుతుందని వైద్యులు, రోగులు పేర్కొంటున్నారు.
కొత్తగా మరిన్ని సూపర్ స్పెషాలిటీ సేవలు
టెలీమెడిసిన్ ద్వారా ప్రస్తుతం అందిస్తున్న సూపర్ స్పెషాలిటీ సేవలను మరింత విస్తరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా కార్డియాలజి, అంకాలజి, గ్యాస్ట్రో ఎంటరాలజి, న్యూరాలజి తదితర సేవలను సైతం టెలీమెడిసిన్ ద్వారా ఇవ్వనున్నారు. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర టీచింగ్ హాస్పిటల్స్ నుంచి ఆయా విభాగాలకు చెందిన వైద్యనిపుణులు ఆన్లైన్ ద్వారా బస్తీ దవాఖానల్లోని రోగులకు కన్సల్టేషన్ ఇవ్వనున్నారు. మందుల ప్రిస్కిప్షన్‌ను ప్రస్తుతం ఇతర సేవలకు ఇస్తున్నట్లుగానే ఆన్లైన్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని, అవసరమైన వైద్యపరీక్షలను తెలంగాణ డయోగ్నోస్టిటిక్ ద్వారా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
అవసరమైతేనే పెద్ద దవాఖానలకు
టెలీమెడిసిన్ ద్వారా కన్సల్టేషన్ పొందిన రోగులకు వ్యాధి నిర్ధారణ జరిగిన తరువాత సాధారణ మందులతో చికిత్స అందిస్తారు. వ్యాధి అడ్వాన్స్డ్ స్టేజికి చేరిన రోగులు లేదా శస్త్రచికిత్సలు అవసరమైన రోగులను ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి దవాఖానలకు పంపించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.