హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): ప్రేమగా మాట కలుపుతారు.. ఎదుటివారి బలహీనత పసిగడతారు.. జాతక దోషాలు ఉన్నాయంటూ భయపెడతారు.. మనసులో కలవరం సృష్టిస్తారు.. పూజలతో అరిష్టాలు తొలగిస్తామని బుట్టలో వేసుకుంటారు.. అందినకాడికి దోచుకొని ఉడాయిస్తారు.. రాజస్తాన్ షిరోయి బాబాల దోపిడీ తీరిది. ఇటీవల రాచకొండ పోలీసులు ఏడుగురు సభ్యులు ఉన్న బురిడీ బాబాల ముఠాను అరెస్టు చేసి విచారించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజస్తాన్లోని షిరోయి జిల్లాకు చెందిన అనేక మంది తాంత్రిక పూజలు చేసి దోషాలు పోగొడతామని నమ్మిస్తూ దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్నట్టు తేలింది.
దుష్టశక్తి.. తిష్టవేసిందంటూ..
ఈ ముఠా సభ్యులు భిక్షాటన ముసుగులో సాధువులుగా మారుతారు. నుదుటిపై పసుపు పూసుకొని మధ్యలో పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని.. పూజలు చేసే సాధువులుగా, అఘోరాలుగా కనపడతారు. భిక్షాటనకు వెళ్లినప్పుడు వ్యాపార సముదాయాలు, సంపన్న కాలనీలు, ఇండ్లను టార్గెట్ చేస్తారు. ఎవరైనా కనపడగానే మాట కలిపి కుటుంబ ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఆరా తీస్తారు. ఎదుటివారు తమను నమ్ముతున్నారని అనిపించగానే పూజ చేసి అరిష్టాలు పోగొడతామని నమ్మబలుకుతారు. పూజలు ప్రారంభం కాగానే ఇంట్లో దుష్ట శక్తి తిష్ట వేసిందని, ఇల్లంతా తిరిగి పూజలు చేయాలని చెబుతారు. ఆ సమయంలో ముఠాలోని ఒకరు పెదవి కొరుక్కుని రక్తాన్ని ఉమ్మేస్తాడు. తమకన్నా దుష్ట శక్తి బలంగా ఉన్నదని కలవరం రేపుతారు. ఆ తర్వాత పూజ పూర్తిచేయటానికి లక్షల సొమ్ము కావాలని డిమాండ్ చేస్తారు.
అందినంత దోచుకుంటారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదవుతున్నాయి. రాచకొండ ఎస్వోటీ పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి ఈ ముఠాలోని ఏడుగురిని ఇటీవల పట్టుకున్నారు. ప్రధాన సూత్రదారులు వివిధ రాష్ర్టాల్లో సంచరిస్తుండటంతో వారి కోసం గాలిస్తున్నారు. ఈ ముఠా బారినపడి ఓ వ్యాపారి రూ. 37.71 లక్షలు పోగొట్టుకున్న వైనం నగరంలో సంచలనం రేపింది. ఈ ముఠా బాధితులు ఇంకా ఎంత మంది ఉన్నారనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.