ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 8: ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాల కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాధించింది. కేంద్ర ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు) శాఖ నుంచి ‘వ్యర్థ జలాల శుద్ధి మరియు మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్ ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి’ అనే అంశంపై రూ.పదిహేను లక్షల ప్రాజెక్టు మంజూరైంది. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ చింత సాయిలు ఈ వివరాలను వెల్లడించారు. గత ఐదు దశాబ్దాలుగా భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత శక్తివంతమైన, చైతన్యవంతమైన విభాగంగా ఎంఎస్ఎంఈ రంగం ఉద్భవించిందని చెప్పారు. వ్యవస్థాపకత, ఉపాధి, జీవనోపాధి అవకాశాలను ప్రోత్సహించేందుకు పని చేస్తున్నదని గుర్తు చేశారు. ఎంఎస్ఎంఈ సృజనాత్మక పథకాన్ని ఈ ఏడాది మార్చి 10న ప్రారంభించారని, దేశ నలుమూలల నుంచి వివిధ సృజనాత్మక ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలను వ్యక్తులు, సంస్థలు, పరిశ్రమల నుంచి ఆహ్వానించారని వివరించారు. అనంతరం ఐడియా హ్యాకథాన్ – 2022ను ఎంఎస్ఎంఈ నిర్వహించిందని, తరువాత సంబంధిత రంగ నిపుణులచే వాటిని మూల్యాంకనం చేసి, ఎంపిక చేసిన వాటి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసేందుకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.
మొత్తం దేశవ్యాప్తంగా 257 ఐడియాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, అందులో తమ కళాశాలకు కూడా ఒకటి మంజూరు కావడం గర్వకారణమని చెప్పారు. తమ కళాశాల తరఫున మొత్తం పది ఐడియాలను పంపించామని, చివరికి అభిలాష్ అరకొండ, డాక్టర్ జ్యోతి తాటి, ప్రొఫెసర్ చింత సాయిలు సమర్పించిన ఐడియాకు రూ.15 లక్షలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సాధారణంగా నీటిని శుభ్రం చేసేందుకు విద్యుత్ అవసరం అవుతుందని, కానీ ఈ ప్రాజెక్టులో వ్యర్థజలాలను శుద్ధి చేయడంతో పాటు విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కాలపరిమితి సంవత్సరమని చెప్పారు. తమ కళాశాలలో రీసర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెల్ (ఆర్డీఐసీ) ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులలో వినూత్న పరిశోధనా సంస్కృతిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. నూతన ఆవిష్కరణలు, ప్రచురణలు, పేటెంట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఆర్డీఐసీ మరింత చురుగ్గా పనిచేసేందుకు డైరెక్టర్‌గా ప్రొఫెసర్ వీవీ బసవరావు, కో ఆర్డినేటర్‌గా డాక్టర్ జ్యోతి తాటి వ్యవహరిస్తారని చెప్పారు.