సికింద్రాబాద్, ఫిబ్రవరి 6 : అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కొత్త రాజ్యాంగం అవసరమని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం సబబేనని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీతో పాటు విపక్ష పార్టీల నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలోని 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో బీజేపీ నేతలు పర్యటించి ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేశారని దుయ్యబడుతూ.. ఆ ప్రాంగణంతో పాటు అంబేద్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి సంజయ్.. నోరు జాగ్రత్త, మాట్లాడేటప్పుడు చూసి మాట్లాడాలి బిడ్డ.. అంటూ గజ్జెల నాగేశ్ తీవ్రంగా మండిపడ్డారు. ఓ ముఖ్యమంత్రిని పట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అంబేద్కర్‌ను అవమానించిన అరుణ్ శౌరీని కేంద్రమంత్రి చేసింది బీజేపీ కాదా.. అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ దేశంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని విమర్శించారు.
కొత్త రాజ్యాంగం అంశంపై దమ్ముంటే చర్చకు రావాలని కాంగ్రెస్, బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ఇప్పటికే అనేక మార్లు రాజ్యాంగ సవరణలు జరిగాయని, పరిస్థితులకు అనుగుణంగా మరికొన్ని సవరణలు చేయాల్సిన అవసరముందని చెప్పారు. కొత్త రాజ్యాంగం అంశంలో సీఎం కేసీఆర్‌కు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. కొత్త రాజ్యాంగానికి సంబంధించి సీఎం కేసీఆర్ చేసిన ప్రతిపాదనపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవ చేశారు. కార్యక్రమంలో దళిత సంఘాల నేతలతో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.