సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో పాతనగరం బోనాల నిర్వహణపై ఉత్సవ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి తలసాని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న జరిగే సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరకు, 24న జరిగే పాతనగరం బోనాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు.
18న జరిగే మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు, 25వ జరిగే ఉమ్మడి దేవాలయాల అంబారీ ఊరేగింపు ఖర్చును గతంలో ఆయా ఆలయాలు భరించేవని, ప్రస్తుతం ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి తలసాని చెప్పారు. పాతబస్తీలోని 25 దేవాలయాల వద్ద సాంస్కృతిక శాఖ కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఎల్లమ్మ దర్శనానికి 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేయగా, మూడు రోజుల్లో 6.5లక్షల మంది భక్తులు వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు రోజున చార్మినార్ వద్ద 500 మంది కళాకారులతో వివిధ కళా ప్రదర్శనలు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ అధ్యక్షులు రాకేశ్ తివారీ, మధుసూదన్ యాదవ్, మధుసూదన్ గౌడ్, గాజుల అంజయ్య, శంకర్‌యాదవ్, దత్తాత్రేయ, హన్స్‌రాజ్, ఆదర్శ మహేశ్, దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్లు బాలాజీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.