బండ్లగూడ,ఫిబ్రవరి 6: ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు ఆస్తి పన్ను వసూలు కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు అదివారం నుంచి ఆస్తిపన్ను వసూలు కోసం తగిన చర్యలు చేపట్టి టార్గెట్ను చేరుకోవాలని ఇచ్చిన ఆదేశాలతో రాజేంద్రనగర్ సర్కిల్ అధికారులు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆదివారం ఆస్తిపన్ను పరిష్కార వేదికను ఆదివారం ప్రారంభించారు. ఈనెల 6 తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు ప్రతి ఆదివారం ఆస్తిపన్ను పరిష్కార సమావేశాలు నిర్వహించి ఆస్తిపన్నులో అసమానతలు, ఇతర సమస్యల పరిష్కారాలకు గాను అధికారులు ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఆస్తిపన్ను చెల్లింపులో ఏవైనా సమస్యలు ఉన్నా, నివాసం ఖాళీగా ఉన్న వారు ఈ సమావేశాల్లో పరిష్కరించుకునేందుకు గాను ఆస్కారం ఉంది. ఆస్తి పన్ను వసూలుకు మార్చి 31వ తేదీ గడువు తేదీ కావడంతో ఉన్నతాధికారులు ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసేందుకు గాను అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 8 ఆదివారాలు ఫిర్యాదులను స్వీకరించి ఆయా ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో సందర్శించి నిజ నిర్ధారణ చేసుకున్న తరువాత పరిష్కారం చూపుతారు.
ప్రతి ఫిర్యాదును స్వీకరిస్తాం..
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి లోని ఆస్తిపన్నుదారులందరూ తమ ఆస్తిపన్ను చెల్లింపులో సమస్యలు ఉంటే ఈ పరిష్కార వేదికల ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆస్కారం ఉంటుంది. మార్చి 31 వరకు ప్రతి ఆదివారం నిర్వహించే ఆస్తిపన్ను పరిష్కార సమావేశంలో భవన యజమానులు తమ ఆస్తిపన్ను చెల్లింపులో ఉన్న సమస్యల గురించి అధికారులకు ఫిర్యాదు చేస్తే సంబంధిత ఆస్తులను పరిశీలించి సమస్యలకు పరిష్కారం చూపుతారు.
-ఉప కమిషనర్, జగన్