హయత్‌నగర్, జూలై 7:నగర శివారులో చెడ్డీగ్యాంగ్ వరుసగా నాలుగు ఇండ్లల్లో చోరీలకు పాల్పడి బంగారు, వెండి నగలతోపాటు నగదుతో ఉడాయించింది. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు, ప్రజయ్ గుల్మోహర్ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో ప్లాట్ నం.125లో నివాసముంటున్న సరిత, శ్యాంరెడ్డి దంపతులు ఇంటికి తాళం వేసి 10 రోజుల కిందట వైజాగ్ వెళ్లారు.
ప్లాట్ నం.88లో నివాసముంటున్న క్లారా ప్రభాకర్, కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాలో ఉంటున్నారు. ఆయన కూతురు నైనా అప్పుడప్పుడు బెంగళూరు, హైదరాబాద్‌కు వచ్చి వెళ్తూ ఉంటుంది. ప్లాట్ నం.109లో నివాసముంటున్న సాజిద్ హుస్సేన్ వ్యాపారి కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి బీదర్‌లో ఉంటున్నాడు. ప్లాట్ నం.91లో నివాసముంటున్న సురేంద్రనాయుడు కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీ కాలనీకి ఎంట్రెన్స్ వద్ద సెక్యూరిటీ ఉండటంతో బుధవారం తెల్లవారుజామున దొంగలు కాలనీకి వెనుక వైపు నుంచి ప్రహరీకి ఉన్న వైర్లు కత్తిరించి లోపలికి ప్రవేశించారు.
నాలుగు ఇండ్లకు ఉన్న తాళాలు పగులగొట్టి సరిత, శ్యాంరెడ్డి దంపతుల ఇంట్లోని ఏడు తులాల బంగారు నగలు, కిలో వెండి ఆభరణాలు, రూ.10 వేలు నగదు, క్లారా ప్రభాకర్ ఇంట్లోని 19 తులాల బంగారు నగలు, రెండు కిలోల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సాజిద్ హుస్సేన్, సురేంద్ర నాయుడు ఇండ్లలో ఎలాంటి నగలు, నగదు లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్ బృందాలతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, క్రైమ్ డీసీపీ యాదగిరి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, డీఐ నిరంజన్, సిబ్బందితో కలిసి సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు సంచరించిన ప్రదేశాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.