బంజారాహిల్స్,జూలై 7: అచ్చే దిన్ అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సచ్చేదిన్ త్వరలోనే వస్తాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా గురువారం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ.. ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలపై మరోసారి గ్యాస్ సిలిండర్ల ధరను రూ.50 పెంచిన కేంద్రం ప్రభుత్వం మరోసారి తమ వైఖరిని చాటుకుందన్నారు. కార్పొరేట్ సంస్థలకు వేలకోట్ల రాయితీలు ఇస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ పేదలను పీల్చి పిప్పి చేస్తోందన్నారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించకపోతే మరింత ఉధృతంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి. సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతాయాదవ్, టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు, మాధవి తదితరులు పాల్గొన్నారు.