సికింద్రాబాద్, జూలై 7: పండుగలు ప్రశాంత వాతావరణంలో, శాంతియతంగా జరుపుకోవాలని నార్త్‌జోన్ డీసీపీ చందనా దీప్తి సూచించారు. గురువారం చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతాఫల్మండి మల్టీ పర్పస్ ఫంక్షన్హాల్లో కార్పొరేటర్లు సామల హేమ, సునీతతో పాటు పలు శాఖల అధికారులతో కలిసి పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. బక్రీద్ పండుగను శాంతియూతంగా నిర్వహించుకోవాలని, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులకు సహకరించాలని డీసీపీ చందనా దీప్తి పేర్కొన్నారు. రహదారులపై వ్యర్థ్థాలు లేకుండా జీహెచ్ఎంసీ అధికారులు చూడాలని డీసీపీ సూచించారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ సుధీర్, సీఐలు నరేశ్, మధులతతో పాటు పలువురు సీఐలు, ఎస్సైలు, ఆయా శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలని కార్ఖానా సీఐ రవీందర్ సూచించారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో ముస్లిం మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పండుగల నేపథ్యంలో కుల మతాలకు అతీతంగా సామరస్యాంగా వేడుకలు నిర్వహించాలని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100 లేదా సంబంధిత పోలీసులకు ఫోన్ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు అవినాశ్ బాబు, జ్ఞానదీప్, నరేశ్‌లతో పాటు మతపెద్దలున్నారు.
బక్రీద్ పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన అంశాలపై ట్రాఫిక్ బ్రాంచ్ సిబ్బందితో కార్ఖానా సీఐ రవీందర్ భేటీ అయ్యారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకంగా తీసుకోవాల్సిన చర్యలపై సుధీర్ఘంగా చర్చించారు.