మియాపూర్, జూలై 5 : దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న వత్తిడి నుంచి నగర వాసులు ఉపశమనం పొందేందుకు గాను పచ్చదనం.. ఆహ్లాదం పంచేలా భిన్నమైన థీమ్‌లతో పార్కులను ఏర్పాటు నిర్మిస్తున్నట్లు యూబీడీ అదనపు కమిషనర్ కృష్ణ పేర్కొన్నారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని చందానగర్, శేరిలింగంపల్లి సర్కిళ్లలో ఎంజెన్, సైన్సు, వాటర్ హార్వెస్టింగ్ సహా ఇతర థీమ్ పార్కులను జోనల్ కమిషనర్ శంకరయ్యతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మియాపూర్ డివిజన్ పరిధిలో నిర్మిస్తున్న మల్టీ జనరేషన్ పార్కు నగరానికే తలమానికంగా నిలవబోతున్నదన్నారు.
ఇతర థీమ్ పార్కులను సైతం ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. పార్కులలో నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, పచ్చదనం పెంపుపై యూబీడీ విభాగం అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని అదనపు కమిషనర్ కృష్ణ పేర్కొన్నారు. జోన్ పరిధిలో నిర్మాణ పురోగతిలో ఉన్న 5 థీమ్ పార్కులను మరో మూడు నెలలో ప్రారంభానికి సిద్ధం చేసేలా చర్యలు వేగవంతం చేశామన్నారు. ప్రజలను విశేషంగా ఆకట్టుకునేలా, ఆకర్షించేలా థీమ్ పార్కులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంత్, డీఈ స్రవంతి, ఏఈలు పాల్గొన్నారు.