సిటీబ్యూరో, ఫిబ్రవరి 5(నమస్తే తెలంగాణ)/కీసర: బాలకార్మికుల వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పిలుపునిచ్చారు. కీసర మండల పరిధిలోని చీర్యాల, తిమ్మాయిపల్లి గ్రామాల్లో ఇటుక బట్టీల్లో పనిచేసే వారి పిల్లల కోసం ఒడిశా, మరాఠీ భాషల్లో ఏర్పాటు చేసిన వర్క్ సైట్ స్కూళ్లను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వచ్చిన కార్మికుల పిల్లల కోసం తిమ్మాయిపల్లిలో తొలిసారిగా మరాఠీ భాషలో పాఠశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మూడేండ్ల కిందటే వర్క్ సైట్ స్కూళ్లను అందుబాటులోకి తెచ్చామని, విజయవంతంగా కొనసాగిస్తున్నామని, సుమారు 3000 మంది ఒడిశాకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు చెప్పారు.
రాచకొండ కమిషనరేట్‌కు 2018లో ప్రతిష్టాత్మకమైన ఐఏసీపీ లీడర్షిప్ ఇన్ హ్యూమన్ అండ్ సివిల్ రైట్స్ అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. కాగా,వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీపీ మహేశ్ భగవత్ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. మరాఠీ భాషలో పలు అక్షరాలను రాసి వారితో
పలికించారు.