తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి.కార్పొరేట్ స్కూళ్లను మించి విద్యాబోధన..సకల వసతులు. మొన్నటి వరకు సర్కారు బడుల్లో మా పిల్లలను చేర్పించం అన్నవారే.. ఇప్పుడు ప్రైవేటులో మాన్పించి మరీ..ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నారు.గత ఏడాది రిసాల బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 254 ఉండగా,ఈ ఏడాది కొత్తగా చేరిన వారు 57మంది చేరారు. దీంతో ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య మొత్తం 311కు చేరింది.అదేవిధంగా పయనీర్ బజార్ లో మొత్తం విద్యార్థుల సంఖ్య 215 ఉండగా, కొత్తగా 37 మంది చేరారు. సదర్ బజార్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 175 ఉండ గా ఈ ఏడాది 54 మంది విద్యార్థులు చేరారు. డౌటన్ బజార్ లో మొత్తం విద్యార్థుల సంఖ్య 115 ఉండగా,కొత్తగా 37 మంది విద్యార్థు లు అడ్మిషన్లు తీసుకున్నారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేటు స్కూళ్ల నుండి వచ్చిన వారే కావడం విశేషం. – బొల్లారం,జూన్ 24
ప్రభుత్వ పాఠశాలలపై పెరుగుతున్న విశ్వాసం
తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరుగుతున్నది.చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.మా పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ఉండడంతో,ఉన్నత బోధనా ప్రమాణాలు, వసతులు ఉన్నట్లుగా గుర్తించి ప్రత్యేకంగా చుట్టూ పక్కల వారు కౌకూర్,యాంజాల్,అద్రాస్ పల్లి,హకీంపేట,ప్రాంతాల నుంచి మా పాఠశాలలో చేర్పించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. -ప్రభాకర్,పయనీర్ బజార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.
ఆంగ్ల మాధ్యమం అమలుతో..
ప్రైవేటు పాఠశాలలో ఫీజుల భారం డబుల్ పెంచారు.దాని కారణంగా ఫీజులు కట్టలేకుండా ఉన్నాం.అదే సమయంలో పయనీర్ బజార్ బొల్లారం వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంను అమలు చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. అంతేకాకుండా నాణ్యమైన విద్య,మెరుగైన వసతులు ఉండడంతో ఈ పాఠశాలలో చేర్చించేందుకు వచ్చాం.
-విక్రమ్,జన ప్రియ అపార్ట్మెంట్స్ బొల్లారం,విద్యార్థి తండ్రి