తెలుగుయూనివర్సిటీ, జూన్ 23: బాల బాలికలలో దాగి ఉన్న సృజనాత్మకతకు పదునుపెట్టి ఉన్నతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా నెలకొల్పబడిన జవహర్ బాలభవన్ కేంద్రాలకు 57 ఏండ్లు పూర్తయ్యాయి. బాలలకు మనోవికాసాన్ని కల్పిస్తున్న ప్రతిష్టాత్మక సంస్థ బాలభవన్ కేంద్రాలను భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆలోచనలలో నుంచి పుట్దిందే. ఆయన ఆశయాన్ని మాజీ ప్రధాని, ఆయన కూతురు ఇందిరా గాంధీ నెలకొల్పారు.
ఈ ప్రక్రియకు అప్పటి మంత్రి, మాజీ ప్రధానీ పీవీ నరసింహారావుతో చర్చించి హైదరాబాద్ కేంద్రంగా పబ్లిక్‌గార్డెన్స్ ప్రాంగణంలో నెలకొల్పారు. నాటి నుంచి ఔత్సాహిక బాల బాలికలకు లలిత సంగీతం, చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, గానం, జానపద గీతాలతో పాటు వివిధ కళా ప్రక్రియలలో సుశిక్షితులైన అధ్యాపకులతో శిక్షణనిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అవార్డులు, రివార్డులు సాధించారు. రాష్ట్రంలోని జిల్లాలు, ముఖ్య పట్టణాలలో బాల భవన్లు, బాల కేంద్రాలు నిత్యం పిల్లలకు శిక్షణిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నాయి. జవహర్ బాలభవన్, బాల కేంద్రాల అభివృద్ధికి సహకరిస్తున్న విద్యాశాఖకు బాలభవన్ డైరక్టర్ డాక్టర్ ఉషారాణి ధన్యవాదాలు తెలిపారు. సిబ్బంది నిబద్ధతతో పనిచేసి బాలబాలికలకు సేవలను అందించాలని ఆమె సూచించారు.