సిటీబ్యూరో/బన్సీలాల్‌పేట్, జూన్ 17(నమస్తే తెలంగాణ) : అగ్నిపథ్ ఆందోళనల్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన పోలీసు కాల్పులు, లాఠీచార్జి, రాళ్లదాడిలో గాయపడిన 14మంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ఆందోళనకారులు గాంధీకి చేరుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో దవాఖానను కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకుని, స్థానిక పోలీసులతో కలిసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాయి. మీడియాతో సహా ఇతరులెవరినీ దవాఖానలోనికి అనుమతించడం లేదు. దవాఖాన పరిసర ప్రాంతాల్లో సైతం భారీగా బలగాలను మోహరించారు. అంబులెన్సులు, రోగి సహాయకులను మాత్రమే పరిశీలించి అనుమతిస్తున్నారు. దీంతో గాంధీ దవాఖాన వద్ద సాధారణ రోగులకు తిప్పలు తప్పడం లేదు.
నలుగురికి బుల్లెట్ గాయాలు.. ఒకరు మృతి
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో గాయపడిన ఆర్మీ అభ్యర్థుల్లో నలుగురికి బుల్లెట్ గాయాలైనట్లు గాంధీ వర్గాల ద్వారా తెలిసింది. అందులో వరంగల్ జిల్లాకు చెందిన దామోదర్ రాకేశ్ (18)ను పోలీసులు హుటాహుటీన గాంధీ దవాఖానకు తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే రాకేశ్‌కు తల, కడుపు భాగంలో బుల్లెట్ గాయాలు కావడం వల్లే మృతిచెందినట్లు తెలిసింది. వైద్యులు మాత్రం అధికారికంగా వెల్లడించేందుకు నిరాకరించారు. వికారాబాద్ జిల్లా గుండ్రేటిపల్లికి చెందిన డి.మహేశ్ (22)కు వీపులో నుంచి ఛాతి భాగానికి బుల్లెట్ దిగి, తీవ్రంగా గాయపడటంతో బాధితుడికి శస్త్ర చికిత్స చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం, లక్ష్మీపురానికి చెందిన బానోత్ నాగేంద్రబాబు (20)కు తొడ భాగంలో బుల్లెట్ దిగడం వల్ల అతడి కాలు విరగడంతో అతడికి సైతం శస్త్ర చికిత్స నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.
ఆ12 మందీ సేఫ్:
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అగ్నిపథ్ ఘటనలో గాయపడిన 14మందిని చికిత్స నిమిత్తం గాంధీకి తరలించగా అందులో ఇద్దరికి శస్త్రచికిత్స చేశారు. మిగిలిన 12మంది క్షతగాత్రులకు చిన్నపాటి గాయాలు కాగా, వారికి జనరల్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సూపరింటెండెంట్ వెల్లడించారు. గాంధీలో చికిత్స పొందుతున్న వారిలో జగన్నాథ్ రంగస్వామి (కర్నూల్), కె.రాకేశ్ (కరీంనగర్), జె.శ్రీకాంత్ (మహబూబ్‌నగర్), జి.పరశురామ్ (కామారెడ్డి), ఎ.కుమార్ (వరంగల్), పి.మోహన్ (కామారెడ్డి), ఎల్.వినయ్ (మహబూబ్‌నగర్), విద్యాసాగర్ (ఆసిఫాబాద్), లక్ష్మణ్‌రెడ్డి (నల్గొండ), భరత్ (నిర్మల్), వి.మల్లికార్జున్ (కొండగల్, వికారాబాద్) ఉన్నారు.
రాకేశ్ మృతదేహానికి పూర్తయిన పోస్ట్‌మార్టం..బంధువులకు అప్పగింత
పోలీసు కాల్పుల్లో మృతిచెందిన దామోదర్ రాకేశ్ (18) మృతదేహానికి నగరంలో నివసించే అతడి బంధువుల సమక్షంలో పంచనామా నిర్వహించిన అనంతరం గాంధీ దవాఖానలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. సాయంత్రం భారీ పోలీసు బందోబస్తు మధ్య మృతదేహాన్ని అంబులెన్స్‌లో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం డబీర్‌పూర్ గ్రామానికి తరలించారు.