కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 17 : వందశాతం స్వచ్ఛతను సాధించేందుకు ప్రజలందరూ సహకరించాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ అన్నారు. శుక్రవారం ఫతేనగర్, మూసాపేటలలో పట్టణ ప్రగతిని డీసీ రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత.. పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా పట్టణ ప్రగతిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాలనీలు బస్తీలలో చెత్తాచెదారాన్ని తొలగించి పరిశుభ్రంగా మారుస్తున్నట్లు తెలిపారు. దోమల నియంత్రణకు ఫాగింగ్, యాంటీలార్వా ఆపరేషన్ పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటుతూ.. పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రగతిలో పారిశుధ్య కార్మికులు బాధ్యతగా పనిచేసి కాలనీలన్నింటినీ శుభ్రంగా మార్చాలన్నారు. కార్యక్రమంలో ఏఎంహెచ్‌వో, ఎస్ఎస్, ఎస్ఎఫ్ఏ లు పాల్గొన్నారు.
దోమల నియంత్రణకు చర్యలు..
పట్టణ ప్రగతితో దోమల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆల్విన్‌కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతిలో భాగంగా ఎల్లమ్మ చెరువులో డ్రోన్ సహాయంతో రసాయనాల పిచికారిని కార్పొరేటర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. అపరిశుభ్రమైన పరిసరాలతోనే దోమలు, ఈగలు వృద్ధి చెందుతాయన్నారు. వ్యర్థాలను జీహెచ్ఎంసీ ఆటోలోనే వేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు దొడ్ల రామకృష్ణా గౌడ్, అధ్యక్షుడు సమ్మారెడ్డి, కాశీనాథయాదవ్, శివరాజ్ గౌడ్, రాజ్యలక్ష్మి, మధులత, వాసుదేవరావు, పోశెట్టి గౌడ్, దేవి, స్వరూప, నస్రిన్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ ప్రగతితో సమస్యలు పరిష్కారం
పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతున్నాయని కార్పొరేటర్ సబీహాబేగం అన్నారు. శుక్రవారం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని మేరాజ్నగర్లో కార్పొరేటర్ సబీహాబేగం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనతరం పద్మావతినగర్‌లో రూ.35 లక్షల వ్యయంతో సీసీరోడ్ల పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డుకు ఇరువైపులా వ్యర్థాలను తొలగించి, పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జావిద్, సలావుద్దీన్, అస్లం, సలీం, సాదకలీ, నజ్మా, అస్మా పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి వేదిక
సమస్యల పరిష్కారానికి పట్టణ ప్రగతి వేదికైందని ఓల్డ్‌బోయిన్‌పల్లి కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని నారాయణపురి కాలనీలో ఆయన పాదయాత్ర చేస్తూ కాలనీవాసులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి కార్యక్రమం సమస్యలు పరిష్కరించడానికి చక్కటి వేదికైందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలందించడానికి ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం హర్షణీయం అన్నారు. కార్యక్రమంలో డీఈ బాలకృష్ణ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్రె జంగయ్య, మేకల హరినాథ్, రాజు యాదవ్, పిట్ల రాజు, ఉదయ్, కనకదాస్, తేజ, శ్రీకాంత్, చైతన్య తదితరులు పాల్గొన్నారు.