అబిడ్స్, జూన్ 17 : మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారమవుతున్నాయని జాంబాగ్ కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా హిందీనగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, ఏఎంఓహెచ్, సిబ్బందితో కలిసి శుక్రవారం మొక్కలను నాటారు. అనంతరం రాకేశ్ జైస్వాల్ మాట్లాడుతూ.. 15 రోజులుగా నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా జీహెచ్ఎంసీ బృందాలు డివిజన్లోని అనేక బస్తీలు, కాలనీల్లో సమస్యలను పరిష్కరించాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన పౌర సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వర్షాలు కురిసినప్పుడు వర్షం నీరు నిలవకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవడం జరిగిందన్నారు. ఆయన జీహెచ్ఎంసీ కార్మికులు, జలమండలి సిబ్బందిని సన్మానించారు. కార్యక్రమంలో అమర్‌సింగ్, రాజేశ్, అనిల్, రామకృష్ణ, రఘు, రేణుక, కాజల్, విజయ్, భాను పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి ద్వారా సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతున్నాయని మలక్‌పేట డిప్యూటీ కమిషనర్ జయంత్ అన్నారు. శుక్రవారం సైదాబాద్ డివిజన్పరిధిలోని సైదాబాద్కాలనీలో జరిగిన పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమానికి ఆయన డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ.. కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పరిష్కరించామన్నారు. దీర్ఘకాలిక సమస్యలను దశల వారీగా పరిష్కరించటానికి ప్రయత్నాలు చేస్తామన్నారు. సైదాబాద్ కాలనీలోని ఖాళీ స్థలంలో మహిళలకు ఉపయోగకరంగా ఉండేవిధంగా షటిల్ కో ర్టును ఏర్పాటు చేస్తామన్నారు. సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని అన్నికాలనీల్లో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించటానికి కృషి చేయాలని, రోడ్ల అభివృద్ధికి ని ధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ యుగేందర్ రెడ్డి, జలమండలి మేనేజర్ శ్రవణ్, వర్క్ ఇన్స్పెక్టర్ మనోహర్, జీహెచ్ఎంసీ ఏఈ వెంకన్న, వర్క్ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్, శానిటేషన్ సూపర్వైజర్ చందు, జవాన్ నర్సింగ్ రావు, ఉద్యానవన శాఖ అధికారి అంజయ్య, యమున, బీజేపీ రాష్ట్ర నాయకులు కొత్తకాపు రవీందర్ రెడ్డి, కాలనీ సంక్షేమసంఘం అధ్యక్షులు మల్లారెడ్డి, రఘు, విజయలక్ష్మి, శ్రీరాములు, ఆచార్య పాల్గొన్నారు.
తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత అన్నారు. లక్ష్మినగర్ కాలనీలో తాగునీటి పైపులైన్ నిర్మాణ పనులశంకుస్థాపన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. నూతన పైపులైన్‌ను ఏర్పాటు చేయడంతో తాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు. కార్యక్రమంలో భాగ్యనగర్ జిల్లా ఉపాధ్యక్షులు జంగం మధుకర్ రెడ్డి, వీరేంద్రబాబు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు రాధాకృష్ణ, రాంరెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.