ముషీరాబాద్, జూన్ 17: వానాకాలంలో మొదలవడంతో జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు విపత్తులను ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేశారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడటానికి 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక టీం లను నియమించారు. సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఒక్కో డివిజన్‌కు 11 మంది సభ్యులతో కూడిన అత్యవసర బృందాలను నియమించారు. అంతేకాదు డివిజన్‌కు ఒక ఎమర్జెన్సీ వాహనాన్ని సిద్ధంగా ఉంచారు. సర్కిల్ పరిధిలో మొత్తం 66 మంది ఎమర్జెన్సీ బృందం సభ్యులు వానాకాలం పూర్తయ్యే వరకు అత్యవసర సేవలకై మూడు షిప్టుల వారీగా అందుబాటులో ఉంటారు. ఒక్కో షిప్టులో నలుగురు చొప్పన 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. ఆయా డివిజన్ల పరిధిలో వరద సహాయక చర్యలు చేపట్టనున్నారు. ఇక వర్షం కురిసినా కురవకపోయినా డివిజన్లలో అందుబాటులో ఉండనున్న ఎమర్జెన్సీ బృందాల సభ్యులు రోడ్లకు మరమ్మతులు, పూడిక తొలగింపు వంటి పనులు చేపట్టనున్నారు. ఎమర్జెన్సీ బృందాలకు ఏఈలు, డీఈ సారధ్య వహించనున్నారు.
అంతా అప్రమత్తం..
గతంలో వానాకాలంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వరద సమస్యల పరిష్కారం కోసం ఇంజినీరింగ్ విభాగం అధికారులు ముందుజాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నాలాలు, పల్లపు ప్రాం తాల వద్ద నాలాలు, పైపులైన్లలో పూడిక తొలగించిన అధికారులు మ్యాన్‌హోళ్లకు మూతల ఏర్పాటు, వరద నీరు సాఫీగా వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వర్షాలు కురవడం మొదలైన నేపథ్యంలో వరద నీటిపై పైపులైన్లకు సంబంధించిన మ్యాన్ హోళ్లకు మర్మతులు ముమ్మరంగా చేపడుతున్నారు. మరోవైపు వరద నీరు నిలిచిపోతే వాహనదారులు, పాదచారులకు ఇబ్బం ది కలుగకుండా మ్యాన్‌హోళ్లపై మూతలు ఏర్పాటు చేస్తున్నారు. భారీగా వరదలు వచ్చి నీరు రోడ్లు, బస్తీల్లో నిలిస్తే వెంటనే ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగి వెంటనే తొలగింపు పనులు చేపడతారు. అంతేకాదు మ్యాన్‌హోళ్ల వద్ద ఎప్పటికప్పుడూ చెత్త, చెదారం లేకుండా చర్యలు తీసుకోనున్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు
వరద నీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఎమర్జెన్సీ బృందాలను నియమించడంతోపాటు ఎక్కడ సమస్యలు తలెత్తే అవకాశం ఉందో గుర్తించి సిబ్బంది అవగాహన కల్పించడం జరిగింది. ఎక్కడైనా వరద నీటి సమస్యలు తలెత్తితే ప్రజలు 04021111111 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడతారు.
– శ్రీనివాస్, ఈఈ సర్కిల్-15 జీహెచ్ఎంసీ