ఖైరతాబాద్, జూన్ 14 : ‘వరల్డ్ బ్లడ్ డోనర్ డే’ సందర్భంగా మంగళవారం సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్‌లోని సంస్కృతి భవన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గవర్నర్ తమిళి సై, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ చైర్మన్ అజయ్ మిశ్రా, గవర్నర్ సెక్రటరీలు, రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ సురేంద్ర మోహన్లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రక్తదానం చేయడమంటే ఎందరో ప్రాణాలను రక్షించడమేనని అన్నారు. రెడ్ క్రాస్ రక్త నిధి సేకరణలో అగ్రభాగాన ఉందని, కరోనా సమయంలో ఆర్మీ, పోలీసు అధికారుల సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. అనంతరం, అత్యధికంగా రక్తదానం చేసిన 35 మంది దాతలకు గవర్నర్ తమిళి సై బహుమతులు అందించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ రావు, భవానీ శంకర్, రఘు ప్రసాద్, రాష్ట్రపతి ఉత్తమ సేవా అవార్డు గ్రహీత, హైదరాబాద్ చైర్మన్ భీమిరెడ్డి పాల్గొన్నారు.
రక్తదానం చేసి నిజమైన హీరోలవ్వండి
కొండాపూర్, జూన్ 14: ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తాన్ని దానం చేసి నిజమైన హీరోలుగా మారాలని ప్రముఖ నటుడు సోనూసూద్ పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని మాదాపూర్‌లోని ఓ హోటల్లో యూబ్లడ్ మొబైల్ యాప్‌ను వ్యవస్థాపకుడు జగదీశ్ యలమంచిలి, చైర్మన్ కృష్ణమూర్తిలతో కలిసి ఆవిష్కరించారు.
ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన శిబిరాల్లో రాచకొండ పోలీసులు అత్యధికంగా రక్తదానం చేసిన వారీగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజ్‌భవన్‌లో అవార్డును అందించారు. అవార్డును రాచకొండ కార్ హెడ్ క్వార్టర్స్ అదనపు డీసీపీ షమీర్ స్వీకరించారు.