బేగంపేట్ జనవరి 31: ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం రాంగోపాల్‌పేట్ డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో ఆయన స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్రతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎంజీ రోడ్డులోని ఆజాం హోటల్ వద్ద రూ. 14 లక్షలతో చేపట్టనున్న సీవరేజ్ పైపులైన్ పునరుద్ధరణ పనులు, మెక్లాడ్గూడలో రూ. 18.50 లక్షలతో చేపట్టనున్న స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు, జవహర్‌నగర్‌లోని లక్ష్మీనారాయణ అపార్ట్మెంట్ వద్ద రూ.42 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు, స్ట్రామ్ వాటర్ డ్రైన్ మరమ్మతు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆజం హోటల్ గల్లీలో టాయిలెట్స్ నిర్మించాలని స్థానికులు కోరగా, వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తమ సమస్యలను పరిష్కరిస్తున్న మంత్రి తలసానికి రాంగోపాల్‌పేట్ డివిజన్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ అరుణగౌడ్, జలమండలి జీఎం రమణారెడ్డి, ఏసీపీ క్రిష్టఫర్, తదితరులు పాల్గొన్నారు.