సిటీబ్యూరో, జూన్ 12 (నమస్తే తెలంగాణ): నేటి నుంచి బడి గంట మోగనున్నది. విద్యార్థులు బడిబాటపట్టనున్నారు. నిన్నటి వరకు వేసవి సెలవుల ఒడిలో సేదతీరిన చిన్నారులు చదువుల తల్లి ఒడిలోకి చేరుతున్నారు. అందుకు తగ్గట్టుగానే అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ముఖ్యంగా కరోనా జాగ్రత్తలు పకడ్బందీగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు విద్యార్థులను క్షేమంగా తరలించే స్కూల్ బస్సుల విషయంలో ఆర్టీఏ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల రవాణా శాఖ పరిధిలో 11,842 విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి.నిబంధనలు పాటించనిచో బస్సులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.ఇప్పటికే స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు పంపించారు.
బడిలో జాగ్రత్తలు.!
విద్యార్థులకు మాస్కుల పంపిణీ, శానిటైజర్లు అందించడం.. తరగతి గదుల శానిటైజేషన్‌ను విధిగా యాజమాన్యాలు పాటించనున్నాయి. స్కూల్లో ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్ వస్తే.. ఆ విద్యార్థి చుట్టుపక్కల కూర్చున్న విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. ఇప్పటికే విద్యాశాఖాధికారులు స్కూళ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. తరగతి గదులు, బెంచీలు, కిటికీలు, టాయిలెట్లు, నల్లా లు, హ్యాండ్‌వాష్ సింక్లు, తాగునీటి ట్యాంకులు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు ఇలా అన్నింటి వద్ద శుభ్రం చేయించారు. ట్యాంకుల్లో పేరుకుపోయిన చెత్త, నిల్వనీటిని తొలగించారు. పాఠశాల ప్రాంగణాలను శానిటైజేషన్ చేశారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది అంతా మాస్కులు ధరించడం తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేశారు.
బస్సుల నిబంధనలు ఇదిగో.!
మోటార్ వాహనాల చట్టం ప్రకారం స్కూల్ బస్సు తప్పక పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో 1. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ), 2. వ్యాలీడ్ ఇన్స్యూరెన్స్ సర్టిఫికెట్, 3. వ్యాలీడ్ ఫిట్నెస్ సర్టిఫికెట్, 4. పర్మిట్, 5. ట్యాక్స్ పేమెంట్ రశీదు(బకాయిలు లేకుండా), 6. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్, 7. డ్రైవర్ లైసెన్స్ తప్పనసరిగా వాహనంతో ఉండాలి.
ట్రాఫిక్ పోలీస్ అలర్ట్..
సోమవారం నుంచి పాఠశాలలు ప్రారంభం కావడంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆటోలు, బస్సులు, వ్యాన్లు, పార్కింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి విషయాలపై దృష్టిసారించారు. ఎక్కడా ట్రాఫిక్ సమస్య రాకుండా ముందస్తు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల యాజమాన్యాలతో సమావేశమయ్యా రు. పెరిగిన రద్దీ.. ట్రాఫిక్ సమస్యపై సమావేశాలు ఏర్పాటు చేసి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. నగరంలో ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకున్నట్టు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.
సాంకేతికంగా జాగ్రత్తగా ఉండాలి: ప్రవీణ్ రావు, డీటీఓ, రంగారెడ్డి
స్కూల్ బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించుకోవాలి. ముఖ్యంగా సాంకేతికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. యాంత్రికంగా చూస్తే ఇంజిన్, గేర్ బాక్సు, క్లచ్, స్టీరింగ్ పనితీరు సక్రమంగా ఉందో.! లేదో పరిశీలించుకోవాలి.వాటిలో ఎలాంటి లోపాలు ఉండకూడదు. ఎలక్ట్రికల్ విషయాల్లో బ్యాటరీ, వైపర్స్, రెండు వైపులా ఇండికేటర్లు పకడ్బందీగా పనిచేయాలి. యాజమాన్యాలు డ్రైవర్ వివరాలు పేరేంట్స్‌కు తెలిసేలా ఉంచాలి. ఫిట్నెస్ చేయని వాహనాలు రోడ్డెక్కితే సీజ్ చేస్తాం.
నిబంధనలు పాటించాలి: పి. రవీందర్ కుమార్, ఆర్టీఓ, ఉప్పల్
విద్యా సంస్థల బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాలి. నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు ఉండాల్సిందే. నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఫిట్నెస్ లేకున్నా.. అర్హత లేని డ్రైవర్లను నియమించుకున్నా కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం.