సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కోర్సులో ఏఐ, ఎంఎల్, డేటాసైన్స్, మిషన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులు ప్రవేశ పెట్టే ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల సంఖ్య ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాలేజీల వారీగా కొత్తగా ప్రవేశ పెట్టిన ఎమర్జింగ్ కోర్సు బోధించడానికి కావాల్సిన నైపుణ్యాలు పెంపొందించడానికి జేఎన్టీయూ హైదరాబాద్ చర్యలు కొనసాగిస్తున్నది. అందుకోసం అఫిలియెటెడ్ కాలేజీలకు చెందిన టీచింగ్ ఫ్యాకల్టీకి శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, యూజీసీ-హెచ్డీఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ జీకే విశ్వనాథ్ తెలిపారు. ఎమర్జింగ్ కోర్సులలో భవిష్యత్లో అన్ని కాలేజీలలో ప్రవేశపెడుతారని, ఆ మేరకు ఫ్యాకల్టీని సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికే ఐఐటీ, ఎన్ఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఏఐ, ఎంఎల్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులు ప్రవేశ పెట్టారు.
ఆయా విద్యా సంస్థలలో పని చేస్తున్న టీచింగ్ ఫ్యాకల్టీ శిక్షణ పొందారు. ఈ క్రమంలో జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న టీచింగ్ ఫ్యాకల్టీ శిక్షణ ఇవ్వడానికి ఐఐటీ ముంబయి, ఐఐటీ హైదరాబాద్, ఎన్ఐటీ, ఇతర జాతీయ విద్యా సంస్థలకు చెందిన సీనియర్ ప్రొఫెసర్లతో ఆన్లైన్ విధానంలో ఫ్యాకల్టీ నైపుణ్య శిక్షణ కొనసాగుతున్నాయని డైరెక్టర్ తెలిపారు. ఫ్యాకల్టీ నైపుణ్య శిక్షణ పొందుతున్న వారిలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఫ్యాకల్టీతో పాటు ఈసీఈ, ఎలక్ట్రానిక్ విభాగాలకు చెందిన ఫ్యాకల్టీ ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ నెల 22 వరకు టీచింగ్ ఫ్యాకల్టీ నైపుణ్య శిక్షణ తరగతులు కొనసాగుతాయని, దీనిని అందరూ సద్వినియోగపరుచుకోవాలని డైరెక్టర్ ఫ్యాకల్టీకి సూచిస్తున్నారు.

భవిష్యత్లో మంచి డిమాండ్..
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పాటు అదనంగా ఎమర్జింగ్ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్లో మంచి డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయని యూనివర్సిటీ అధికారులు భావిస్తున్నారు. అందుకోసమని ఇప్పటికే సీఎస్ఈ పూర్తి చేసిన విద్యార్థులతో పాటు మెకానిక్, సివిల్, ఈఈఈ, ఈసీఈ చెందిన విద్యార్థులందరూ ఎమర్జింగ్ టెక్నాలజీ కోర్సులు తిరిగి ఆరు నెలల డిప్లొమా రూపంలో చదువుతున్నట్లు జేఎన్టీయూ హైదరాబాద్ రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. ఈ క్రమంలో 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఎగ్జిట్ విధానంలో ఇంజినీరింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకుస్తున్నామన్నారు. అయితే నాలుగు సంవత్సరాల బీటెక్ కోర్సును రెండు సంవత్సరాలు చదివితే డిప్లొమా, మూడు సంవత్సరాలు చదివితే అడ్వాన్స్డ్ డిప్లొమా, నాలుగు సంవత్సరాలు చదివితే బీటెక్ డిగ్రీ పేరుతో సర్టిఫికెట్లు ప్రదానం చేయడానికి బీవోఎస్లో నిర్ణయం తీసుకున్నట్లు రెక్టార్ వెల్లడించారు.