సిటీబ్యూరో, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు దీటుగా అభివృద్ధి చేయడంపై రైల్వే మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. అందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి టెండర్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ మేరకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. టెండర్ ప్రీ బిడ్ సమావేశాన్ని ఈ నెల 21న నిర్వహించడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టను ఈపీసీ విధానంలో ప్రారంభిస్తున్నారు. అయితే నిర్మాణం టెండరు ప్రకటించిన తేదీ నుంచి 36 నెలల్లో పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్లు రైల్వే అధికారులు శనివారం ప్రకటించారు.
సికింద్రాబాద్ స్టేషన్లో వసతి సదుపాయాలు..
సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధిలో భాగంగా స్టేషన్లో అన్ని ప్రాంతాలలో కావాల్సిన వసతి సదుపాయాలు మెరుగుపడుతాయి.
ప్రస్తుతం ఉత్తరం వైపు భాగంలో జీ+3 అంతస్తులతో 22516 చదరపు మీటర్లతో నూతన స్టేషన్ భవనం ఏర్పాటు చేస్తారు.
ప్రస్తుత దక్షిణ వైపు భాగంగా భవనం జీ+3 అంతస్తులతో, 14,792 చదరపు మీటర్లతో విస్తరణతో పాటు అభివృద్ధి చేస్తారు.
108 మీటర్లతో రెండు అంతస్తుల స్కై కాన్కోర్స్ నిర్మిస్తారు. మొదటి అంతస్తు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రెండో అంతస్తు ప్రజలకు రూఫ్‌టాప్ ప్లాజాగా (24,604 చదరపు మీటర్లు) అందుబాటులో ఉంటుంది.
స్టేషన్ ఉత్తరం వైపు ఒక మల్టీ లెవల్ (ఐదు లెవల్లో) పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదనంగా స్టేషన్‌లోని దక్షిణం వైపు విడిగా ఒక అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చేస్తారు.
ప్రస్తుతం ఉన్న ప్లాట్‌ఫారాలు నూతన స్టేషన్‌కు అనువుగా పూర్తి పై కప్పు అభివృద్ధి చేయడం చేస్తారు. వీలైతే పునరుద్ధరిస్తారు.
ఉత్తరం, దక్షిణం వైపు భవనాల వద్ద ట్రావెలేటర్స్‌తో రెండు వాక్‌వేలు (7.5 మీటర్లు) నిర్మాణం చేస్తారు.
టెన్సిల్ ఫ్యాబ్రిక్‌తో క్యాన్‌పై (డ్రాప్ ఆఫ్/ పికప్ ప్రదేశాలు) ప్రవేశ ద్వారా, బయటకు వెళ్లే మార్గాలలో ఏర్పాటు చేస్తారు. దాని వల్ల స్టేషన్‌కు వచ్చి వేళ్లే ప్రయాణికులకు, వాహనాల కదలికలకు ఇబ్బందులు ఉండవు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోసం 5000 కేవీపీ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు.
సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధిలో ముఖ్యాంశాలు..
రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ద్వారా నగరంలోని ప్రధాన భాగం అభివృద్ధి చెందడంతో పాటు స్టేషన్ మొత్తం పునర్నిర్మాణం జరుగుతుంది.
బహుళ ప్రయాజనాలు ఉన్న రవాణా వ్యవస్థతో ప్రయాణికులు ఒక చోట నుంచి మరొక ప్రాంతం వరకు ఆటంకాలు లేకుండా ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉంటుంది
రైలు ప్రయాణికులకు స్టేషన్లో మెరుగైన ప్రయాణ అనుసంధానం ఉంటుంది. ప్రయాణికులు రైలు ఎక్కడానికి, దిగడానికి అనువైన ప్రదేశాలతో పాటు తగిన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తారు.
ప్రయాణికుల రద్దీ ప్రాంతాలలో రద్దీని తగ్గించడానికి, నగర రోడ్డు నెట్‌వర్క్‌తో అనుసంధానించడానికి తోడ్పడుతుంది. రైల్వే స్టేషన్‌తో పాటు చుట్టుపక్కల ట్రాఫిక్ వ్యవస్థ మెరుగువుతుంది.
స్థానిక వ్యాపారుల కోసం వ్యాపార అవకాశాలు కల్పించి, ఆదాయం పెరుగడానికి నూతన సిటీ సెంటర్ ఏర్పాటు చేస్తారు.