చార్మినార్, జూన్ 11 : ఓ చిన్నారి ధైర్యానికి పోలీసులు సెల్యూట్ చేశారు. ‘సార్ నా స్నేహితురాలి తండ్రి రోజు మద్యం తాగి..ఆమె తల్లిని హింసిస్తున్నాడం’టూ ఆమె పోలీస్‌స్టేషన్‌కు వచ్చి.. ఫిర్యాదు చేయడంతో శభాష్ అంటూ మెచ్చుకున్నారు. హుస్సేనీ ఆలం ఇన్స్పెక్టర్ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సాలం గల్లీకి చెందిన పదేండ్ల ముంతాజ్ బేగం స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నది. శనివారం మధ్యాహ్నం తన ఇంటికి సమీపంలో ఉండే స్నేహితురాలి తండ్రి జహంగీర్ తాగిన మత్తులో ఆమె తల్లిపై దాడి చేశాడు. స్థానికులు వారించినా వినలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అతన్ని దారిలో పెడతారని గ్రహించిన ముంతాజ్.. హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్‌కు పరుగున చేరుకుంది. చిన్నారి పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కడంతో సిబ్బంది ఆశ్చర్యపోయా రు. ముంతాజ్ బేగం ధైర్యాన్ని మెచ్చుకొని.. విషయం తెలుసుకొని..రిసెప్షన్ వద్దకు తీసుకెళ్లి వివరాలు తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ నరేశ్‌కుమార్ పాపను ప్రత్యేకంగా ప్రశంసించి..బాలికతో కలిసి సదరు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జహంగీర్‌కు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ముంతాజ్ చొరవ చూసి.. స్థానికులు సైతం అభినందించారు.