అమీర్‌పేట్, జూన్ 11 : అరిస్తే చంపేస్తామంటూ… ఓ కుటుంబాన్ని బెదిరించి..బంధించి.. దోచుకెళ్లిన ఇద్దరు దొంగలను సనత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 8న భరత్‌నగర్ ఎంఐజీ-2లో నివాసముంటున్న వేటూరి వెంకటేశ్వర్లు ఇంట్లో కిటికీ ఊచలు తొలగించి ప్రవేశించిన దొంగలు పూజ మందిరంలోని బంగారు వస్తువులతో పాటు వెండి దేవతామూర్తుల విగ్రహాలు, చిల్లర నాణేలు, ఐపాడ్‌ను దొంగిలించారు. అలికిడికి వెంకటేశ్వర్లు కుమారుడు నిద్రలేవడంతో అతడి కడుపుపై కాలితో తొక్కి.. అరిస్తే చంపేస్తామంటూ బెదిరించి.. పక్క గదిలో బంధించారు. వెంకటేశ్వర్లు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి.. అతడి కుమార్తెతో పాటు గదిలో నిద్రిస్తున్న మరో బాలిక మెడలో గొలుసులు తొలగిస్తుండగా, వారు మేల్కొని కేకలు వేయడంతో వారిని సైతం బెదిరించి.. బయట నుంచి గదికి గడియ పెట్టి వెళ్లిపోయారు. వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వారు ఏపీకి చెందిన కుమాలి నాగార్జున (34), గన్నాబత్తుల సోమేశ్వర వెంకన్ననాయుడు (32)గా గుర్తించారు. సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.